Ganja Found in Road Accident: సూర్యాపేట-జనగామ జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం.. గంజాయి రవాణా చేస్తున్న యువకుడిని దొరికేలా చేసింది. జనగామ జిల్లా లింగాలఘనపురం మండలం నెల్లుట్ల దుర్గామాత ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. పట్టుబడిన యువకుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్, వినయ్, జాన్, మహేశ్లు విశాఖపట్నం నుంచి గంజాయి రవాణా చేస్తుంటారు. వీరు విశాఖ నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై గంజాయి సంచితో హైదరాబాద్ బయల్దేరారు. నెల్లుట్ల వంతెన వద్ద జనగామ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారును ఢీకొట్టి పడిపోయారు. ముగ్గురు ఓ ద్విచక్ర వాహనంపై పారిపోగా.. మరో బైక్ స్టార్ట్ కాకపోవడంతో మహేశ్ అక్కడే ఉండిపోయాడు.
గ్రామస్థులు గమనించి సపర్యలు చేస్తూ.. సంచిని పరిశీలించగా గంజాయి కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వెళ్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రమాద బాధితుడికి సాయం చేయడానికి కారు దిగారు. గంజాయి రవాణా విషయం తెలుసుకొని.. ‘‘గీ పని చేస్తార్రా.. భవిష్యత్తు ఖరాబ్ చేసుకుంటుండ్రు’ అంటూ యువకుడిని మందలించారు. మంచి పని చేశారంటూ నెల్లుట్ల గ్రామస్థులను అభినందించారు. సుమారు 11 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రఘుపతి తెలిపారు.
ఇవీ చదవండి :