ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని వరుస హత్యలు చేస్తున్న సైకో కిల్లర్‌ను ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో 16మంది మహిళలను హత్య చేసి జైలుకు వెళ్లి బయటికొచ్చిన మైన రాములు.. మరో రెండు హత్యలు చేశాడు. మొత్తం 18 హత్యలు చేసి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారిన రాములును... ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఆ కేసుతో వెలుగులోకి
ఈ నెల 4న ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సగం కాలిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన ఘట్కేసర్ పోలీసులు జూబ్లీహిల్స్‌లోని వెంకటగిరి కాలనీకి చెందిన వెంకటమ్మగా గుర్తించారు. ఘట్కేసర్ పోలీసులతో పాటు... ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా సమాంతర దర్యాప్తు చేపట్టారు. మృతురాలు ఓ వ్యక్తితో కలిసి ఈ నెల 4వ తేదీన ఆటోలో వెళ్లినట్లు గుర్తించారు.
జైలు నుంచి వచ్చి మరో రెండు హత్యలు
సీసీ కెమెరాల ద్వారా నిందితుడి ఫొటోను సేకరించిన పోలీసులు... పాత నేరస్థుడిగా గుర్తించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్లకు చెందిన ఐన రాములు... మహిళలపై ద్వేషంతోనే హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో 16 హత్యలు, 4 దొంగతనాలు చేసిన రాములు... గతేడాది జులైలో జైలు నుంచి బయటికి వచ్చి మరో రెండు హత్యలు చేసినట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. అన్ని ఘటనల్లోనూ మహిళలే బాధితులని చెప్పారు. భార్య వదిలేయడంతో మహిళలపై కక్ష పెంచుకున్నాడని వివరించారు.
ఇదీ చదవండి : మహిళలను చంపిన సైకో... పట్టించిన చిన్న చీటీ