Pregnant Suspected Death: అత్తింటి వారి వేధింపులకు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఏడు నెలల గర్భిణీ స్త్రీ కడుపులో బిడ్డతో సహా అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ మండలం పర్వతగిరి శివారు భూరుగుంట తండా సమీపంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం వ్యవసాయ బావిలో మృతదేహం కనిపించడంతో తండా వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త, అత్తమామలే చంపి వ్యవసాయ బావిలో పడేశారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. నిండు గర్భిణీ మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
నెల్లికుదురు మండలం మేచారాజుపల్లి శివారు పడమటి గడ్డ తండాకు చెందిన దివ్యకు(22) మహబూబాబాద్ జిల్లా పర్వతగిరి శివారు భూరుగుంట తండాకు చెందిన దిలీప్‌తో 11 నెలల క్రితం వివాహం జరిపించారు. దివ్య గర్భం ధరించినప్పటి నుంచి అబార్షన్ చేయించుకోమని భర్త, అత్తమామలు వేధిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ ఘటన అనంతరం దివ్య భర్త , అత్తమామలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు.
భూరుగుంటతండాకు చెందిన దిలీప్‌తో మా అన్న బిడ్డకు వివాహం జరిపించాం. ఏడు నెలల గర్భిణీని భర్త, అత్తమామలు కొట్టి చంపి రాత్రి బావిలో పడేసిర్రు. అత్త,మామ, అడపడచు కలిసి మా బిడ్డను చంపిండ్రు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి. ఈ పరిస్థితి మరెవరికీ జరగొద్దు.
- వెంకన్న, మృతురాలి బంధువు
అధిక కట్నం కోసం అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక ఆమె నిన్న సాయంత్రం ఏడుగంటల సమయంలో వ్యవసాయబావిలో ఆత్మహత్య చేసుకుందని మాకు తెలిసింది. ఆమె వయసు 22 సంవత్సరాలు. ప్రస్తుతం ఆమె గర్భిణీ. ఆమె భర్త, అత్తమామలు, ఆడపడచులు వేధించారని మా దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను జైలుకు పింపస్తాం. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. దీనిపై స్థానిక తహసీల్దారు మేడం వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకెవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం.
- రవికుమార్, మహబూబాబాద్ రూరల్ సీఐ
దివ్యను గర్భిణీ అనే కనికరం లేకుండా భర్త , అత్తమామలు, ఆడపడచు కొట్టి బావిలో పడేశారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివ్య బావిలో పడిందా, భర్తనే బావిలో తోశారా అన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టామని మహబూబాబాద్ రూరల్ సీఐ రవికుమార్ వెల్లడించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి: రామకృష్ణగౌడ్‌ది పరువు హత్యే.. తేల్చిన పోలీసులు