GUNTUR CRIME NEWS: కరోనా నేపథ్యంలో నాటువైద్యం అందిస్తానంటూ ఓ మహిళ నమ్మబలికి 13 ఏళ్ల బాలికను తీసుకువెళ్లి పలుచోట్ల వ్యభిచారం చేయించిందంటూ పోలీసులకు బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ జరుపుతున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే బాలిక కొందరి పేర్లను వెల్లడించింది. వీటి ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసినట్లు గుంటూరు దక్షిణ మండలం డీఎస్పీ జెస్సీ ప్రశాంతి చెప్పారు.
వైద్యం చేయిస్తానని తీసుకెళ్లి పలుచోట్ల...
అతని భార్య, కూతురికి కరోనా సోకడంతో గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించగా భార్య చికిత్స పొందుతూ ఈ ఏడాది జూన్‌లో చనిపోయింది. ఈ క్రమంలో ఆ బాలికకు తండ్రి తప్ప మరెవరూ లేరని గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన ఓ మహిళ తెలుసుకుంది. తాను ఆసుపత్రిలో నర్సునని ఆ బాలిక తండ్రిని నమ్మించింది. నాటు వైద్యం చేయిస్తానని బాలికను ఇంటికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో వ్యభిచారం చేయించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యం పాలైన ఆ బాలిక రెండురోజుల క్రితం ఇంటికి చేరుకుని జరిగిన విషయం తండ్రికి చెప్పింది. తండ్రి ఫిర్యాదు మేరకు గుంటూరు అర్బన్ జిల్లా పోలీసులు మేడికొండూరు స్టేషన్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును అరండల్‌పేట స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ బాలికకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితురాలు వ్యభిచారం నిర్వాహకురాలని, నర్సు కాదని తెలుసుకున్న పోలీసులు.. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ..
minor girl raped in guntur district: పల్నాడులోని ఓ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఆ బాలికకు 13 ఏళ్లు. కరోనా బారిన పడి జీజీహెచ్‌లో చేరగా గుంటూరు స్వర్ణభారతినగర్‌కు చెందిన ఓ మహిళ నమ్మించి తన వెంట ఇంటికి తీసుకెళ్లిన కొద్ది రోజులకే వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెచ్చింది. ఆ పనిచేయడం ఇష్టం లేదని చెప్పిన బాలికను ఇంట్లో బంధించి బయటకు రానీయకుండా కొన్నాళ్లు గుంటూరులో ఆ తర్వాత ఒంగోలు, నెల్లూరు, విజయవాడకు సైతం తీసుకెళ్లి వ్యభిచారం చేయించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
గత కొద్దిరోజుల నుంచి అనారోగ్యం బారిన పడింది. దీంతో వ్యభిచార నిర్వాహకురాలు ఆ బాలికను విజయవాడలో వదిలేయడంతో ఇంటికి చేరిందని అనుమానిస్తున్నారు. బాలిక తండ్రి గుంటూరులో ఓ ఫ్యాక్టరీలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఆ బాలిక తప్పిపోయినట్లు సుమారు రెండు నెలల క్రితం నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ బాలిక నెల్లూరులో ఉందని తెలియటంతో నల్లపాడు పోలీసులు కేసును క్లోజ్ చేశారు.
బాలికను తండ్రే అప్పగించారా? కోణలో విచారణ..
రెండు నెలల క్రితం ఆ బాలిక నెల్లూరులో ఉందని తెలిస్తే అదుపులోకి తీసుకోకుండా ఇన్నాళ్ల పాటు దీన్ని గోప్యంగా ఉంచడం ఏమిటి? ఇప్పటి దాకా ఆ బాలిక ఎవరి చెరలో ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ బాలికను తండ్రే అప్పగించారా? దీని వెనుక ఏమైనా బేరసారాలు జరిగాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. దీనిపై గుంటూరు సౌత్ డీఎస్పీ జెస్సీ ప్రశాంతిని వివరణ కోరగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ధ్రువీకరించారు.
నిందితులపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు
నిందితులు వ్యభిచారం చేయిస్తారని ధ్రువీకరించుకున్నామన్నారు. అయితే వారు ప్రస్తుతం ఫోన్లు స్విచాఫ్ చేసి ఉంచారని, ఆ బాలిక కోలుకున్నాక పూర్తిస్థాయిలో విచారిస్తామని తెలిపారు. ప్రస్తుతం బాలిక నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు చెప్పారు. మేడికొండూరులో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరండల్‌పేటకు బదిలీ చేశామని, ఈ స్టేషన్ పరిధిలోనే ఆ బాలిక ఎక్కువ రోజులు ఉండడంతో కేసును ఇక్కడకు బదిలీ చేసినట్లు వెల్లడించారు.