Ameenpur Family suicide case updates : సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ పట్టణంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు అత్మహత్యకు కారణాలు అంతు చిక్కడం లేదు. మృతదేహాలను పోలీసులు పటాన్‌చెరు ప్రభుత్వ ఆస్పత్రికి గురువారం తరలించి... పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారు మృతదేహాలను శామీర్‌పేట మండలం తూంకుంట పట్టణం పోతాయ్‌పల్లికి తీసుకువెళ్లారు. శుక్రవారం 11గంటలకు కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇంటి నుంచి మృతదేహాలను తరలించే సమయంలో పోలీసులు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని క్లూస్‌టీంకు అప్పగించారు. ఆ రెండు ఫోన్‌లు పూర్తిగా ఫార్మాట్ చేసి ఉన్నాయి. ఎవరితోనైనా తగాదాలు ఉన్నాయా.. అధ్యాత్మికపరంగా ఏమైనా విశ్వాసాలున్నాయా.. ఆర్థిక పరమైన ఇబ్బందుల కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.
పథకం ప్రకారమే..
family suicide news : శ్రీకాంత్‌గౌడ్ కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకునేందుకు ముందుగానే పథకం వేసుకున్నాడా అని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకు కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. వాళ్ల ఇంటి పనిమనిషికి మంగళవారం సాయంత్రం శ్రీకాంత్ ఫోన్ చేసి.. మేము ఊరికి వెళ్తున్నాం, రెండు రోజుల తరువాత వస్తాం, మళ్లీ ఫోన్ చేసే వరకు రావద్దని చెప్పాడు. పాలు పోసే వ్యక్తికి కూడా అదే రోజు ఫోన్ చేసి చెప్పాడు.
సోషల్ మీడియా అకౌంట్ల తొలగింపు
శ్రీకాంత్‌గౌడ్ ఆత్మహత్యకు ముందే అతని ఫోన్, భార్య అనామిక ఫోన్లను పూర్తిగా ఫార్మాట్ చేశాడు. అతని ల్యాప్‌టాప్‌లో ఉన్న సమాచారం కూడా పూర్తిగా తొలగించాడు. ఇంటర్‌నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో ఉండే హిస్టరీని కూడా తొలగించాడు. ఫోన్‌లో ఉండే సిమ్‌కార్డును కూడా తొలగించి కనిపించకుండా చేశాడు. ఫోన్లలో డేటా లేకపోవడంతో విచారణ పోలీసులకు ఇబ్బందిగా మారింది. నిపుణుల సహకారంతో డేటాను సేకరించే పనిలో ఉన్నారు. ఇంట్లో ఉన్న ఫొటోలు బోర్లా పడిఉండటం, మృతి చెందిన వారి ముఖాలపై పెద్ద తిలకం బొట్టు ఉండటంతో, పోలీసులు వీరికి ఆధ్యాత్మికంగా ఏమైనా నమ్మకాలున్నాయా.. అనే కోణంలో విచారించినట్లు తెలిసింది. కొందరు.. కుటుంబీకులు ఎవరైనా మరణిస్తే ఇంట్లో దేవుడి చిత్ర పటాలను తిరగేసి ఉంచుతారని తెలుసుకున్నారు.
రుణ భారంతోనే..
శ్రీకాంత్ గౌడ్ కుటుంబం సహా ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్థిక పరమైన అంశాలే కావచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇంటి కొనుగోలుకు బజాజ్ ఫైనాన్స్‌లో రూ.30లక్షల హౌసింగ్ రుణం తీసుకున్నాడు. ఇంటిపై అంతస్తు నిర్మాణం సమయంలో రూ.11లక్షల టాప్‌అప్ రుణం తీసుకున్నాడు. మరో రూ.7లక్షల వ్యక్తిగత రుణం కూడా తీసుకున్నట్లు గుర్తించారు.
ఏం జరిగింది?
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ వందన పురి కాలనీలో ఏడేళ్ల చిన్నారితో సహా దంపతులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేగింది. షాద్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్ గౌడ్, అల్వాల్‌లోని బ్రాహ్మణ కులానికి చెందిన అనామికలు గత పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి అనురాగానికి ఏడేళ్ల కూతురు స్నిగ్ధ కూడా ఉంది. శ్రీకాంత్ గౌడ్ టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా... అనామిక స్థానికంగా ఉన్న ప్రాచీన్ గ్లోబల్ కార్పొరేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. ముచ్చటైన సంసారం.. ఏమైందో తెలియదు గానీ రెండు రోజుల నుంచి కనిపించడం లేదు. అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి ఫోన్ చేసినా ఫోన్ లేపడం లేదు.
ఇదీ చదవండి: బోర్లించి ఉన్న దేవుని పటాలు... కూతురితో పాటు దంపతుల మృతదేహాలు.. అమీన్పూర్లో మిస్టరీ డెత్