పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కలవచర్లలో న్యాయవాద దంపతులను కిరాతకంగా నరికి చంపిన కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కుంట శ్రీనివాస్, చిరంజీవి, అక్కపాక కుమార్, బిట్టు శ్రీనులను అరెస్టు చేసిన పోలీసులు.. హత్య పథక రచనపై ఆధారాలు సేకరిస్తున్నారు. హత్య జరిగినప్పుడు... చాలా మంది ప్రత్యక్షంగా చూడటంతో... వారందరూ పోలీసులకు సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హత్యకు సంబంధించిన వీడియోలు ఉంటే పంపాలని సూచించారు. 8500136910 ఫోన్ నంబర్‌కు వీడియోలు వాట్సప్ చేయొచ్చని తెలిపారు. హత్య జరిగినప్పుడు చాలామంది.. బస్సులు, వాహనాల్లో నుంచి వీడియోలు తీశారన్న సీపీ సత్యనారాయణ... వాటిని పంపిస్తే దర్యాప్తునకు ఉపయోగపడతాయని విజ్ఞప్తి చేశారు.ఒత్తిళ్లు, అపోహలకు తావు లేదు.. ఎంతటి వారినైనా వదిలేదన్నారు. హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫోరెన్సిక్ బృందం వచ్చిందని..ఉన్నతాధికారుల సమక్షంలో సాంకేతిక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు.
హత్యలతో సంబంధం లేదన్న పుట్టమధు
హత్య ఘటనపై పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ప్రమేయంపై అనుమానాలు వ్యక్తం అవుతుండటంతో... ఆయన స్పందించారు. కొన్ని టీవీలు, పత్రికలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని... మంథనిలో జరిగిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తెలిపారు. హైకోర్టు న్యాయవాదుల జంట హత్య కేసులో పోలీసులు చేయాల్సిన దర్యాప్తు మీడియానే చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కుట్రలకు మీడియా తోడైందని విమర్శించారు. హత్య తర్వాత తాను మంథనిలో ఉండటం లేదని... ప్రచారం చేస్తున్నాయని తాను ఎక్కడికీ పారిపోలేదని.. మంథనిలోనే ఉన్నానని స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్‌ను ఏ విధమైన అపాయింట్‌మెంట్ అడగలేదన్నారు. కొన్ని మీడియా ఛానళ్లు మంథని ఎమ్మెల్యేకు అమ్ముడుపోయాయని మండిపడ్డారు. పోలీసుల విచారణ తర్వాత హైదరాబాద్‌లో అన్ని సాక్ష్యాధారాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని పుట్ట మధు వెల్లడించారు.
చలో గుంజపడుగుకు భాజపా పిలుపు
భారతీయ జనతా పార్టీ ఆదివారం... చలో గుంజపడుగుకు పిలుపునిచ్చింది. భాజపా న్యాయ వ్యవహారాల విభాగం ఆధ్వర్యంలో గుంజపడుగులో గట్టు వామనరావు కుటుంబసభ్యులను పరామర్శించి వారికి ధైర్యం కల్పించనున్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు ఎల్బీనగర్ నుంచి 300 మంది న్యాయవాదుల బృందం గుంజపడుగుకు ఉదయం 7గంటలకు బయల్దేరనుంది. వామన్‌రావు కుటుంబసభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న భరోసాను ఈ న్యాయవాదుల బృందం ఇవ్వాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. ఈ బృందంలో వివేక్ వెంకటస్వామి, సోమారపు సత్యనారాయణ, భాజపా న్యాయ విభాగ్ వ్యవహారాల కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్, జి రామారావు, అంతోని రెడ్డితోపాటు పలువురు న్యాయవాదులు ఉంటారని బండి సంజయ్ తెలిపారు.
సీబీఐ విచారణ జరపాలి
పెద్దపల్లి జిల్లా కల్వచర్లలో హత్య జరిగిన ఘటనా స్థలాన్ని హైకోర్టు న్యాయవాదుల బృందం పరిశీలించింది. న్యాయవాద దంపతుల హత్య హేయమైన చర్య అని వెల్లడించింది. నడిరోడ్డుపై హత్య జరిగితే.... ఓ గ్రామంలో తగాదాగా చిత్రీకరించే యత్నం చేశారని ఆరోపించారు. అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై దాడులు చేయటం దారుణమని చెప్పారు. ఈ కేసును సీబీఐ ద్వారా విచారణ చేపట్టాలని కోరారు.
ఇదీ చదవండి: అసలు దోషులకు శిక్ష పడే వరకు పోరాడతాం: న్యాయవాద జేఏసీ