మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కురవి మండలం పోలంపల్లి తండా శివారు మామిడి తోటలో పీడీఎస్ బియ్యం నిల్వ చేసినట్లు సమాచారం అందుకున్న పోలీసులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో 180 క్వింటాల బియ్యం స్వాధీనం చేసుకుని నిందితుడు బాదావత్ శంకర్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చుట్టుపక్కల గ్రామాలలో రేషన్ బియ్యంను తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
నల్ల బెల్లం పట్టివేత..
ఆమనగల్ శివారులోని ఓ మామిడి తోటలో అక్రమంగా నిల్వ చేసిన 6 లక్షల 50 వేల రూపాయల విలువ చేసే 65 క్వింటాల నల్లబెల్లం, క్వింటా పటికను పోలీసులు సీజ్ చేశారు.
మహబూబాబాద్ మండలం అయోధ్య శివారు భజనా తండాకు చెందిన నలుగురు ఒక ముఠాగా ఏర్పడి తక్కువ ధరకు బెల్లం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటి రెడ్డి వెల్లడించారు. వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎవరైనా అక్రమ వ్యాపారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటిని పట్టుకునేందుకు కృషి చేసిన పోలీసు సిబ్బందికి రివార్డులను అందించి అభినందించారు.
ఇదీ చదవండి: 'ఎన్నికల్లో గెలిస్తే హెలికాప్టర్, ఇంటికి రూ.కోటి!'