హనుమకొండలో విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాదిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉన్మాది అజహర్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. తనను ప్రేమించాలంటూ ఇవాళ ఉదయం ప్రేమోన్మాది అజహర్ విద్యార్థిని(23)పై కత్తితో గొంతు కోసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ విద్యార్థిని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చదువుతోంది.
అసలేం జరిగిందంటే: పట్టపగలు విద్యార్థిని ఇంట్లోకి చొరబడిన ఉన్మాది ఆమె గొంతుకోసి, పారిపోయాడు. వరంగల్ జిల్లా నర్సంపేటలోని లక్నేపల్లికి చెందిన విద్యార్థిని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఐ చివరి సంవత్సరం చదువుతూ పోటీపరీక్షలకు సిద్ధమవుతోంది. ఇందుకోసం తల్లిదండ్రులతో కలిసి హనుమకొండ గాంధీనగర్ కాలనీలో నివాసం ఉంటుంది. కాగా ప్రిపరేషన్ కోసం కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లిన యువతి.. నిన్న సాయంత్రం హనుమకొండకు తిరిగివచ్చింది.
వరంగల్ జిల్లా సంగెం మండలం ముండ్రాయికి చెందిన అజహర్.. గత కొంతకాలంగా విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. గురువారం ఆమె వచ్చిన విషయాన్ని తెలుసుకుని.. గాంధీనగర్‌లోని ఇంటి వద్ద ద్విచక్రవాహనంపై తిరిగాడు. కాగా రేపటి నుంచి కేయూలో పరీక్షలు ఉండటంతో ప్రాజెక్టు వర్క్‌కు సంబంధించి స్నేహితులతో ఫోన్‌లో మాట్లాడుతోంది. ఇంట్లో ఉన్న యువతి తల్లి.. పక్కింటికి వెళ్లిన సమయాన్ని అదునుగా చూసిన కిరాతకుడు ఫోన్ సంభాషణలో ఉన్న విద్యార్థినిపై దాడిచేశాడు. తాను వెంట తీసుకొచ్చిన కత్తితో ఆమె గొంతుకోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఫోన్‌లో కేకలు విన్న స్నేహితులు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వటంతో ఘటన విషయం అందిరికి తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి పరారైన నిందితుడిని పట్టుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: