Cheddi gang members arrest: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చెడ్డీ గ్యాంగ్‌లోని కొందరిని నగర పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారనే విషయం పోలీసులు వెల్లడించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. సుమారు ముగ్గురు ముఠా సభ్యులను గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరిని లోతుగా ప్రశ్నిస్తూ మిగిలిన వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. ఒక్కో దాంట్లో ఐదుగురు చొప్పున రెండు ముఠాలు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఈ నెల 7న పెనమలూరు స్టేషను పరిధిలోని పోరంకి వసంత్‌నగర్‌లో చోరీ చేసిన తర్వాత, ఎక్కడా ముఠా కదలికలు లేవు. నిఘా పెరగడంతో ఇక్కడి నుంచి గుజరాత్‌కు వెళ్లిపోయినట్లు అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలో నగరంలో ప్రత్యేక బృందాలతో నిఘా పెంచారు. దీంతో పాటు నగరం నుంచి రెండు పోలీసు బృందాలు ఆ రాష్ట్రానికి వెళ్లాయి.
సెల్‌ఫోన్లు వాడి.. దొరికిపోయారా?
cheddi gang in police custody: ఈ ముఠాల ఆనవాళ్లు దొరకడానికి ప్రధానంగా దొంగలు సెల్‌ఫోన్లు వాడటమే కారణం. వీరు గత నెలలో గుజరాత్ నుంచి రైలులో వచ్చి విజయవాడలో దిగినట్లు తెలిసింది. ఓ రోజంతా వివిధ ప్రాంతాల్లో తిరిగి రెక్కీ నిర్వహించి, ఇళ్లను ఎంపిక చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. చిట్టినగర్, గుంటుపల్లి, పోరంకిలో గ్యాంగ్ చోరీలకు పాల్పడింది. ఈ ప్రాంతాల్లోని సెల్ టవర్ డంప్‌ను పోలీసులు విశ్లేషించడం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చాయి. మూడుచోట్ల ఉన్న టవర్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లిన కాల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. పలు దేశాలు, రాష్ట్రాలకు వెళ్లిన వాటిల్లో ప్రధానంగా గుజరాత్ కాల్స్‌పై దృష్టి పెట్టగా.. కొన్ని నంబర్లు అనుమానాస్పదంగా కనిపించాయి. వీటికి సంబంధించి సీడీఆర్ వివరాలను తెప్పించుకుని వడపోయగా.. దాహోద్ ప్రాంతానికి ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్ ఉన్నట్లు తేలింది. నగరంలో మూడు చోరీల అనంతరం ముఠాలు ఫోన్లు స్విచాఫ్ చేసుకుని గుజరాత్ వెళ్లినట్లు బయటపడింది.
ప్రత్యేక బృందాలతో అన్వేషణ
special teams to Gujarat: ఈ కేసుల దర్యాప్తు కోసం పోలీసు కమిషనర్ సిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ముఠాలోని నలుగురు దొంగలను అక్కడి పోలీసుల సాయంతో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరి నుంచి మిగిలిన వారి వివరాలు తెలుసుకునేందుకు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. దొంగలు ఇచ్చిన సమాచారం ఆధారంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా, విజయవాడ నుంచి 12 మంది పోలీసులతో కూడిన రెండో బృందాన్ని మంగళవారం సాయంత్రం పంపించారు. ఇప్పటికే అదుపులో ఉన్న వారిని పీటీ వారెంట్‌ను అక్కడి కోర్టులో వేసి, విజయవాడకు తీసుకొచ్చే అవకాశం ఉంది. చెడ్డీ గ్యాంగ్ నగరంలో 8 రోజుల వ్యవధిలో మూడు దొంగతనాలు, యత్నాలకు పాల్పడ్డారు. చెడ్డీ గ్యాంగ్ కోసం రైల్వే లోకో వర్క్ షాప్ సమీపంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు.
రూ. 2.26 లక్షలు సొత్తు చోరీ
చెడ్డీ గ్యాంగ్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో ఎనిమిది రోజుల వ్యవధిలో విజయవాడలో మూడు దొంగతనాలు, గుంటూరుజిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు చోట్ల యత్నాలకు పాల్పడింది. విజయవాడ రెండో పట్టణ స్టేషన్ పరిధిలోని చిట్టినగర్‌లో గత నెల 30న శివదుర్గా ఎన్‌క్లేవ్‌లోని ఓ ఫ్లాట్‌లో తెల్లవారుజామున చోరీకి పాల్పడ్డారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. రూ.10వేలు నగదు, మూడు బంగారు లాకెట్లు, రెండు చెవి దిద్దులు.. మొత్తం 18 గ్రాముల నగలు అపహరించుకెళ్లారు. ఇబ్రహీంపట్నం పీఎస్ పరిధిలోని గుంటుపల్లి నల్లూరి ఎన్‌క్లేవ్‌లో ఈనెల 2వ తేదీ తెల్లవారుజామున ఓ ఫ్లాట్‌లో చొరబడేందుకు యత్నించారు. అందులోని వారు కేకలు వేయడంతో పారిపోయారు. 7న పోరంకి వసంత్‌నగర్‌లో గేటెడ్ కమ్యూనిటీలోని ఓ ఇంటిలో తెల్లవారుజామున దొంగతనం చేశారు. ఇక్కడ రూ.10వేలు నగదు, రూ.1.8 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులను తీసుకెళ్లారు. మూడు ఘటనల్లో దాదాపు రూ.2.46 లక్షల సొత్తు పోయినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: ACB Raids on EX DSP: మాజీ డీఎస్పీ ఇంట్లో అనిశా సోదాలు.. అవినీతి ఆరోపణలే కారణం