ఇనుప సామాగ్రిని అపహరించే ముఠాను మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. ఇందారం గ్రామ శివారులోని వ్యవసాయ విడిభాగాల తయారీ కేంద్రాన్ని లాక్‌డౌన్ వల్ల గతేడాది నుంచి మూసివేశారని డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అక్కడ ఉన్న రూ.4 లక్షలు విలువ చేసే పది టన్నుల ఇనుప సామాగ్రిని యజమాని వడ్డేపల్లి జీవన్ కుమార్ అక్కడే భద్రపరచగా... నిందితులు పలు దఫాలుగా అపహరించినట్లు తెలిపారు. తిరుపతి, శ్రీనివాస్, కమలాకర్, సమ్మక్క, నరేష్, వెంకటి, రాములు ముఠాగా ఏర్పడి మే నెల నుంచి ఎత్తుకెళ్తున్నట్లు పేర్కొన్నారు.
ఈనెల 1న తయారీ కేంద్రం వద్దకు యజమాని వచ్చి చూసి... సామాగ్రి పోయిందని పోలీసులను ఆశ్రయించారని తెలిపారు. గురువారం నాడు తనిఖీల్లో ముఠాలో నలుగురు సభ్యులు పట్టుబడినట్లు వెల్లడించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని చెప్పారు. రెండు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అపహరించిన సామాగ్రిని కొనుగోలు చేసిన బాణాల ప్రసాద్, మల్యాల శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బంది రాజశేఖర్, సుబ్బారావు, శ్రీనివాస్, జయచంద్రలను అభినందించి రివార్డులు అందజేశారు.
ఇదీ చదవండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి