అత్తారింటి ధనదాహం ఆ ఇల్లాలికి శాపమైంది. వరకట్న వేధింపులకు మూడు నెలల గర్భిణి బలైంది. రెండేళ్లు నిండకుండానే మూడుముళ్ల బంధం ఆ ఇల్లాలికి శాపమైంది. భారీగా కట్నకానుకలతో అత్తింట అడుగుపెట్టిన ఆ ఇల్లాలు.. వారి ధనదాహానికి బలైంది. అత్తింటి వారు పెళ్లైన కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నా.. డబ్బు మీద ఆశతో ఆమెను వదిలించుకోవాలని చూశారు. చివరకు అతి కిరాతకంగా కట్టుకున్న భర్తే భార్యకు విషం, యాసిడ్ తాగించి హత్యచేశాడు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
అదనపు కట్నం కోసం మూడు నెలల గర్భిణిని చిత్రహింసలు పెట్టి దారుణంగా కడతేర్చిన ఉదంతమిది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రాజ్పేట్‌తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై అనిల్‌రెడ్డి కథనం ప్రకారం.. మల్కాపూర్‌కు చెందిన కల్యాణి(24)కి రాజ్‌పేట్‌తండా వాసి తరుణ్తో రెండేళ్ల క్రితం పెళ్లైంది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. తర్వాత అదనపు కట్నం కోసం భర్త సహా అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి. ఆమెను వదిలించుకోవాలనే దురుద్దేశంతో మానసికంగా, శారీరకంగా బాధపెట్టేవారు. మంగళవారం భర్తతోపాటు మామ ఫకీరా, సమీప బంధువు ప్రవీణ్ బాధితురాలికి బలవంతంగా విషం, యాసిడ్ తాగించారు. కల్యాణి కేకలు విని పక్కింట్లో ఉంటున్న ఆమె అక్క శోభ కంగారుగా వచ్చేసరికి కింద పడిపోయి నురగలు కక్కుతూ కనిపించారు. స్థానికుల సాయంతో నిజామాబాద్ జనరల్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
ఇవీ చదవండి: