రాచకొండ కమిషనరేట్‌లోని మల్కాజిగిరి డివిజన్ పోలీసులు ఓ బీఫార్మసీ విద్యారిని చుక్కలు చూపింది. కళాశాల ముగిసి చాలాసేపైనా యువతి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి పదేపదే ఫోన్ చేసింది. దీంతో ఆటో డ్రైవర్లు అపహరించారని తల్లికి సమాచారం ఇచ్చింది. తల్లి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. యువతి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలించారు. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు, రహదారిని జల్లెడ పట్టారు. కనిపించిన అన్ని ఆటోలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సాంకేతికతను ఉపయోగించుకొని యువతి ఆచూకీ కనుగొన్నారు.
అర్ధనగ్నంగా, అపస్మారక స్థితిలో
యువతి చరవాణికి ఫోన్ చేసి... ఆమె ఉన్న ప్రదేశం గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లిన పోలీసులకు యువతి.. అర్ధనగ్నంగా, అపస్మారక స్థితిలో కనిపించింది. యువతిని సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. తనను ఆటోడ్రైవర్లు అపహరించి అత్యాచారం చేశారంటూ వైద్యురాలిని, పోలీసులను నమ్మించింది. కళాశాల ముగించుకొని ఇంటికి వెళ్లడానికి బస్సు దిగి నాగారం చౌరస్తాలో ఆటో ఎక్కానని... తను దిగాల్సిన స్టాప్ వద్ద ఆటో అపకుండా యమ్నంపేట వైపు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు యువతి తెలిపింది.
సంబంధిత కథనం: 'ఫార్మసీ విద్యార్థినిపై అఘాయిత్యం' కేసులో కొత్తకోణం
సీసీ కెమెరాల ఆధారంగా
సీసీ కెమెరాల ఆధారంగా ఆరుగురు ఆటోడ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. యువతి చెప్పిన వివరాలను బట్టి ఒక ఆటో డ్రైవర్ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. అతన్ని ఎన్ని రకాలుగా ప్రశ్నించినా... అత్యాచారంలో తన ప్రమేయంలేదని తెలిపాడు. పోలీసులు మరోసారి సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
బస్సు దిగి ఇంటికి వెళ్లకుండా
కళాశాల నుంచి బస్సులో వచ్చిన యువతి బుధవారం సాయంత్రం 5.30కి రాంపల్లి చౌరస్తాలో దిగింది. అక్కడ నుంచి తన ఇంటికి వెళ్లాడనికి ఆటో ఎక్కింది. తను దిగే బస్టాప్ దగ్గర కాకుండా 5.57కు యమ్నంపేటలో ఆటో దిగింది. అక్కడి నుంచి నడుచుకుంటూ ఘట్కేసర్ వరకు వెళ్లింది. ఘట్కేసర్లోని పరిసర ప్రాంతాల్లో దాదాపు గంటకు పైగా కాలినడకన ఒక్కతే తిరిగింది. ఘట్కేసర్లో రాత్రి 7.05కు మళ్లీ ఆటో ఎక్కి అన్నోజీగూడలో దిగింది. అన్నోజీగూడ నుంచి కొంతదూరం ముందుకు వెళ్లి రహదారి పక్కన నిల్చుంది.
పోలీసులు వెళ్లేలోపే
యువతి అపహరణకు గురైందని గాలింపు నిర్వహిస్తున్న పోలీసులు... ఆమెకు ఫోన్ చేసి చిరునామా అడిగారు. పోలీసుల వాట్సాప్‌కు లొకేషన్ పంపించింది. దాని ఆధారంగా పోలీసులు యువతి ఉన్న ప్రాంతానికి వెళ్లారు. యువతి అప్పటికే రహదారి పక్కన చెట్ల పొదల్లో అర్ధనగ్నంగా పడి ఉంది. యువతిని జాగ్రత్తగా వాహనంలోకి ఎక్కించిన పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మొదట తల్లిని ఆటోడ్రైవర్లు అపహరించారని నమ్మించిన యువతి... ఆ విషయం పోలీసుల వరకు చేరడంతో తన బట్టలు తానే విప్పేసుకొని... చెట్ల పొదల్లా పడి... అపస్మారక స్థితిలో ఉన్నట్లు నటించిందని పోలీసుల దర్యాప్తులో తేలింది.
సంబంధిత కథనం: పోలీసులను తప్పుదారి పట్టించిన ఫార్మసీ విద్యార్థి
పొంతన లేకపోవడంతో
చెట్ల పొదల్లో పడిపోవడంతో యువతి కుడికి స్వల్ప గాయమైంది. తనకు మత్తు మందు ఇచ్చి, ముగ్గురు అత్యాచారం చేశారని యువతి చెప్పడంతో... ఆమె స్థితిని చూసి ప్రైవేట్ ఆస్పత్రి వైద్యురాలితో పాటు పోలీసులు కూడా నమ్మారు. ఈ నెల 10న 7.30 సమయంలో యువతిని ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు... గురువారం మధ్యాహ్నం వరకు కూడా యువతి చెప్పిన వివరాల ఆధారంగానే దర్యాప్తు చేశారు. యువతిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ఆమె రక్త నమూనాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్కు పంపారు. యువతి చెప్పిన వివరాలు ఏమాత్రం పొంతన లేకపోవడంతో అనుమానించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తులో పురోగతి సాధించారు.
100కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించి
ఎఫ్ఎస్ఎల్ నివేదికలోనూ.. బాధితురాలి శరీరంలో ఎలాంటి మత్తు పదార్థాలు లేవని తేలింది. దీంతో పోలీసులు ఇదంతా నాటకమని నిర్ధరణకు వచ్చారు. ఘట్కేసర్, మేడిపల్లి, కీసర, మల్కాజిగిరి, కుషాయిగూడ, ఉప్పల్, భువనగిరి ఠాణాలకు చెందిన పోలీసులతో పాటు.. ఎస్ఓటీ పోలీసులు బృందాలుగా ఏర్పడి రెండు రోజుల పాటు 100కు పైగా సీసీ కెమెరాలను పరిశీలించారు. యువతి పోలీసులను, తల్లిదండ్రులను తప్పుదారి పట్టించినట్లు చివరికి తేల్చారు.
ఆటో డ్రైవర్లకు సీపీ సారీ
కుటుంబ కలహాల కారణంగా ఓ యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకుని. అపహరణ నాటకం ఆడిందని పోలీసులు తెలిపారు. కట్టుకథ అల్లడానికి యూట్యూబ్‌లో అపహరణలకు సంబంధించి పలు సీరియళ్లను చూసిందని వెల్లడించారు. అపహరణ, అత్యాచారం నాటకమని తేల్చారు. ఈ ఘటనతో ఎలాంటి సంబంధంలేని ఆటోడ్రైవర్లను విచారణ పేరిట ఇబ్బందికి గురిచేయాల్సి వచ్చిందని.. అందుకు వారికి రాచకొండ సీపీ మహేశ్ భగవత్ క్షమాపణ చెప్పారు. తనపై అత్యాచారం చేశాడని చెబుతున్న ఆటో డ్రైవర్‌తో గతంలో డబ్బుల విషయంలో గొడవ కారణంగానే అతడి పేరును చెప్పినట్లు యువతి ఒప్పుకుందని తెలిపారు. యువతి మాటలు నమ్మిన పోలీసులు కేసును సవాల్‌గా తీసుకుని శాస్త్రీయ ఆధారాలతో మూడు రోజుల్లోనే ఛేదించారు.
సంబంధిత కథనం: ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదు.. అదో నాటకం: సీపీ