టీవీల్లో యాంకర్ ఛాన్సులు, ఉద్యోగాలు ఇప్పిస్తానని, జ్యోతిషం పేరుతో మోసాలకు పాల్పడుతున్న కోనాల అచ్చిరెడ్డిపై నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి. రంగనాథ్ ఆదేశాలతో పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించినట్లు త్రిపురారం ఎస్సై రామమూర్తి పేర్కొన్నారు. యాంకర్ అవకాశం ఇప్పిస్తానంటే ఖమ్మంకు చెందిన ఓ యువతి అతని మాటలు నమ్మిమోసపోయినట్లు తెలిపారు. యువతి ఫిర్యాదుతో నల్గొండ పోలీసులు అరెస్టు చేశారు.
అమాయకులే టార్గెట్
నల్గొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు సాఫ్ట్‌వేర్ కంపెనీలో వాటా ఇప్పిస్తానని నమ్మబలికి రూ.50 లక్షలు కాజేశాడని పేర్కొన్నారు. ఖమ్మం పట్టణానికి చెందిన మరో మహిళకు రైల్వేలో అసిస్టెంట్ ఇంజినీరింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.20 లక్షలు తీసుకున్నాడనే ఫిర్యాదు వచ్చిందని చెప్పారు. త్రిపురారం పోలీస్ స్టేషన్లో ఒక కేసుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో చాలామందిని మోసం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగాల పేరిట రూ.లక్షలను దండుకున్నారని అన్నారు.
అవకాశాల పేరిట..
విజయవాడకు చెందిన ఓ యువతికి ఓ ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ టీవీ ఛానెల్లో యాంకర్‌గా అవకాశం ఇప్పిస్తానని విడతలుగా రూ.25 లక్షలు కాజేశాడని వెల్లడించారు. దీనిపై విజయవాడ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేయగా... చీటింగ్ కేసు నమోదు చేశారన్నారు. నల్గొండలో జ్యోతిషం పేరిట మరో వ్యక్తి దగ్గర రూ.4 లక్షలు తీసుకున్నాడని చెప్పారు. ఇవన్నీ పరిశీలించిన అనంతరం విజయవాడలోని భవానీపురానికి చెందిన కోనాల అచ్చిరెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేశామని ఎస్సై రామమూర్తి వివరించారు. ఉద్యోగం, జ్యోతిషం పేరిట నిందితుడి చేతిలో మోసపోయిన వాళ్లు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
ఇదీ చదవండి: ఏడేళ్ల కుమార్తెని చంపిన కసాయి తండ్రి