Parents Sold Girl Child: ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతలో దూసుకుపోతున్నా.. ఆడపిల్లలపై వివక్ష మాత్రం తగ్గడం లేదు. అమ్మాయి పుట్టిందంటే చాలు గుండెల మీద కుంపటిలా భావిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు కూడా ఇందుకు కారణం కాకపోదు. ఈ క్రమంలో వారిని అమ్ముకోవడానికి కూడా వెనుకాడటం లేదు. హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన తాజాగా జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం.
చెల్లెలి కోసం మరో మహిళ
మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందనే ఆవేదనతో.. 15 రోజుల పసికందును అమ్మేశారు తల్లిదండ్రులు. వనస్థలిపురానికి చెందిన దుర్గాప్రియ, భర్త శ్రీనివాస్ దంపతులు. దుర్గాప్రియ గత నెల 21న ఆడశిశువుకు జన్మనిచ్చింది. అంతకుముందు రెండు కాన్పుల్లో కూడా ఇద్దరూ ఆడపిల్లలే కావడంతో.. ఆ పాపను భారంగా భావించారు. దీంతో పసికందును విక్రయించాలనుకున్నారు. ఆశా వర్కర్ బాషమ్మ సహాయంతో బాలానగర్‌కు చెందిన కవితకు రూ. 80 వేలకు విక్రయించారు. కవిత తన చెల్లెలికి పిల్లలు కావడం లేదనే బాధతో.. ఆ చిన్నారిని కొని ఆమెకు ఇచ్చింది.
ఈ క్రమంలో మనవరాలు క్షేమ సమాచారం అడుగుదామని వచ్చిన అమ్మమ్మకి పాపను విక్రయించిన సంగతి తెలియడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె ఈ విషయాన్ని నేరుగా వనస్థలిపురం పోలీసులకు చేరవేసింది. స్పందించిన పోలీసులు.. కవిత నుంచి చిన్నారిని తీసుకుని శిశు సంరక్షణ కమిటీకి అప్పగించారు. శిశు విక్రయానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇదీ చదవండి: పోలీసులే కారణమంటూ.. నలుగురు మహిళల ఆత్మహత్యాయత్నం..!