Panchayat Secretaries :రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శులు అడకత్తెరలో నలిగిపోతున్నారు. పనిభారంతో పాటు మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. కొందరు అధికారులు, మరికొందరు సర్పంచుల తీరుతో వీరు ఇబ్బందులు పడుతున్నారు. పాలకవర్గం కారణంగా చిన్న తప్పు జరిగినా కార్యదర్శులనే బాధ్యుల్ని చేస్తున్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామక సమయంలో ఒప్పంద కాలపరిమితి మూడేళ్లు ఉంటుందని, తరువాత క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. గతేడాది కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచింది. ప్రభుత్వోద్యోగాల్లో చేరినవారికి అన్ని సదుపాయాలు లభిస్తుంటే, కార్యదర్శులకు రూ.28,719 వేతనం మాత్రమే లభిస్తోంది. వీరిని క్రమబద్ధీకరించకుండా వివిధ లక్ష్యాలు నిర్ణయిస్తూ, పనిచేయకుంటే నిబంధనల ప్రకారం ఉద్యోగం తొలగిస్తామని అధికారవర్గాలు ఒత్తిడి తెస్తున్నాయి.
Work Stress for Panchayat Secretaries : కొత్త పంచాయతీచట్టం ప్రకారం గ్రామాల్లో కార్యనిర్వాహక, ఆర్థిక అనుమతులు పాలకవర్గానికే అప్పగించాయి. పంచాయతీ పాలకవర్గంలోని రాజకీయ విభేదాలతో అభివృద్ధి పనులు చేపట్టినపుడు గొడవలు వస్తున్నాయి. సర్పంచిపై కోపంతో ఉపసర్పంచులు చెక్కులపై సంతకాలు పెట్టేందుకు నిరాకరిస్తున్నారు. అప్పటివరకు నిధులు ఖర్చుచేసి పనులు చేపట్టిన కార్యదర్శులు.. బిల్లులు ఆమోదం పొందక అప్పుల పాలవుతున్నారు. పంచాయతీ కార్యదర్శిపై ఎంపీవో, ఎంపీడీవో, జడ్పీ సీఈవో, డీపీవో, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ పర్యవేక్షణ ఉంటోంది. వారందరికీ సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఇటీవల జీవో నం.317 ప్రకారం ఒకజోన్ అధికారులను మారుమూల జోన్లకు బదిలీ చేయడంతో గ్రేడ్-1 కార్యదర్శులు ఒత్తిడికి గురవుతున్నారు. నిబంధనల ప్రకారం జోన్ పరిధిలో బదిలీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మాపై చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు?
'కార్యనిర్వాహక, ఆర్థిక అధికారాలు పాలకవర్గానికి ఉన్నాయి. కానీ నిధుల విషయంలో కార్యదర్శిపై ఒత్తిడి పెంచుతున్నారు. గ్రామాల్లో చేపట్టే పనుల్లో జాప్యం, నిధుల మంజూరులో అలసత్వానికి సర్పంచులదే బాధ్యత. వారిపై చర్యలు తీసుకోకుండా మాపై ఎందుకు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఒత్తిడి కారణంగా దాదాపు 40 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.'
- మహేశ్, అధ్యక్షుడు, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సెంట్రల్ ఫోరం
కార్యదర్శులు ఆర్థికంగా నష్టపోతున్నారు
'పనులు చేయడం లేదంటున్న అధికారుల ఒత్తిడితో కొందరు కార్యదర్శులు సొంతంగా డబ్బులు పెట్టుకుని పనులు చేయిస్తున్నారు. వీటికి సంబంధించిన బిల్లులపై సంతకాలు పెట్టాలని కోరితే సర్పంచి, ఉపసర్పంచి నిరాకరిస్తున్నారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని అధికారులు చేస్తున్న ఒత్తిడితో కార్యదర్శులు ఆర్థికంగా నష్టపోతున్నారు. సర్కారు దీనికి సంబంధించి చట్టంలో సవరణలు చేయాలి.'
- మధుసూదన్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సంఘం
Panchayat Secretaries Suicide : పనిభారం.. అధికారుల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నారాయణపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈసం వెంకటేశ్ (35) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. మండలంలోని పాతఇర్సులాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్.. ‘‘ఇది ఉద్యోగమా? బానిస బతుకా? పంచాయతీ పనులకు పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. మధ్యతరగతి జీవులం డబ్బులు ఎక్కడి నుంచి తేగలం’’ అంటూ కలెక్టర్, అదనపు కలెక్టర్ పేరిట ఆత్మహత్య లేఖ రాసి ఈ నెల 4న స్వగృహంలో పురుగుల మందు తాగారు. కుటుంబీకులు వెంటనే మహబూబాబాద్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో కలెక్టర్ సూచన మేరకు అదేరోజు హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం వెంకటేశ్ మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. వెంకటేశ్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు బయ్యారం ఎస్సై జగదీశ్ తెలిపారు.