SI Suspended: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలో యువకుడి ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు వచ్చిన ఎస్సైపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఎస్సై ఉదయ్‌కిరణ్‌పై కేసు నమోదు చేసి... వీఆర్‌కు అటాచ్ చేస్తూ ఎస్పీ సురేందర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి విచారణ అనంతరం చర్యలు తీసుకోనున్నారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గణపురం ఎస్సై ఉదయ్‌కిరణ్, షోరూం నిర్వాహకుడు మోతుకూరి శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసినట్లు ములుగు ఎస్సై ఓంకార్ యాదవ్ తెలిపారు. ఆత్మహత్యకు ప్రేరేపించడం, చేతులతో భౌతికదాడులకు పాల్పడినట్లుగా వచ్చిన ఫిర్యాదుల మేరకు 306, 323 ఆర్/డబ్ల్యూ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే... కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రానికి చెందిన నిప్పాని శ్రావణ్ కొన్నేళ్ల కిందట బాలాజి అనే హోండా షోరూంలో ద్విచక్రవాహనాన్ని ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేశారు. కిస్తీల కింద వాయిదాల పద్ధతిలో రుణం తీర్చారు. అయినప్పటికీ ఎన్‌వోసీ (నో ఆబ్జక్షన్) ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా షోరూం నిర్వాహకులు తిప్పుకొంటున్నారు. ఈనెల 10న తన బావమరిది ప్రశాంత్ (24)ను తీసుకుని షోరూంకు వెళ్లారు. అక్కడి నిర్వాహకులు.. వీరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో షోరూం యజమాని మోతుకూరి శ్రీనివాస్.. డయల్ 100కు కాల్ చేశారు.
పోలీసులు వచ్చి ఈ యువకులను ఠాణాకు తరలించారు. అక్కడి ఎస్సై, పోలీసులు యువకులను కొట్టడంతో పాటు మందలించారు. మరుసటి రోజు మళ్లీ రప్పించి తీవ్రంగా కొట్టి పంపించారు. మరోసారి రావాలని ఎస్సై ఉదయ్‌కిరణ్ చెప్పడంతో భయపడిన ప్రశాంత్ ఈనెల 12న ములుగు మండలం బండారుపల్లి వద్ద గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యులు, స్నేహితులు అతడిని ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో హనుమకొండలోని ఓ పైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ 11 రోజుల పాటు చికిత్స పొందాడు. చివరికి మూత్రపిండాలు, ఊపిరితిత్తులు విఫలమై శనివారం మృతిచెందారు.
నిరుపేద కుటుంబం... ప్రశాంత్‌ది నిరుపేద కుటుంబం.. ప్రశాంత్ తండ్రి శ్రీనివాస్ మత్స్యకారుడు. రోజూ గణపురం చెరువులో చేపల వేటకు వెళితేనే బతుకు గడిచేది. ఈక్రమంలో చికిత్స నిమిత్తం ప్రశాంత్‌కు వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో స్నేహితులు గ్రామస్థులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయగా రూ.34 వేల వరకు వచ్చాయి. ఇంకా ఆసుపత్రిలో రూ.5 లక్షల వరకు బిల్లు అయింది. అయినా ప్రశాంత్ దక్కలేదు.
ఇదీ చదవండి:కూలీ పనుల కోసం ఊరు కానీ ఊరు వచ్చారు... విగతజీవులు అయ్యారు...