ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాజుపాలెంలో ప్రభుత్వ పాఠశాల భవనం శ్లాబ్ కూలిన ఘటనలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విష్ణు.. ఆదివారం కావడంతో గ్రామంలోని స్నేహితులతో కలిసి స్కూల్కు వెళ్లాడు. అక్కడ అందరూ ఆడుకుంటుండగా శ్లాబ్ కూలి ప్రమాదం జరిగింది. విష్ణు మృతితో వారి కుటుంబసభ్యులు తీవ్ర వేదనలో మునిగిపోయారు. కడుపుకోత తీర్చేదెవరంటూ తల్లిదండ్రులు ఏడ్చిన తీరు చూపరులను కలచివేసింది. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనానికి మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని.. నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపించారు.
మంత్రి ఆదిమూలపు సురేశ్ దిగ్భ్రాంతి..
పాఠశాల శ్లాబ్ పడి విద్యార్థి మరణించిన ఘటనపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనాలు కూల్చివేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. మరణించిన బాలుడు ప్రైవేట్ పాఠశాలకు చెందిన విద్యార్థి అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: ACCIDENT: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దర్మరణం