He carried his wife dead body on his shoulder: డబ్బులు లేక భార్య మృతదేహాన్ని భుజాన వేసుకొని.. ఒడిశాలోని స్వగ్రామానికి భర్త బయలుదేరిన హృదయ విదారక ఘటన ఏపీలోని విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పొట్టంగి బ్లాక్ సొరడ గ్రామానికి చెందిన ఈడే గురు అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమె భర్త సాములు.. విశాఖ జిల్లాలోని అనిల్ నీరుకొండ మెడికల్ కళాశాల ఆసుపత్రికి తీసుకొచ్చారు.
వారం రోజుల చికిత్స అనంతరం ప్రయోజనం లేదు ఇంటికి తీసుకెళ్లమనడంతో భార్యను తీసుకొని ఆటోలో విజయనగరం బయలుదేరారు. మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందడంతో.. ఆటో డ్రైవరు చెల్లూరు రింగు రోడ్డులో దించేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో సాములు.. భార్య మృతదేహాన్ని భుజం మీద వేసుకొని కాలి నడకన స్వస్థలం బయలు దేరారు.
భాష, దారి తెలియక భార్య మృతదేహన్ని భుజాన వేసుకుని నడిచి వెళ్లుతున్న సాములు గురించి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. విజయనగరం రూరల్ సీఐ తిరుపతి రావు, గంట్యాడ ఎస్ఐ కిరణ్ కుమార్ అతడిని ఆపి వివరాలు తెలుసుకున్నారు. దారి తెలియక అప్పటికే నాలుగు కిలోమీటర్ల మేర వెనక్కి నడిచినట్లు గుర్తించిన వారు.. అతని బంధువులతో ఫోన్‌లో మాట్లాడారు. సాములకు భోజనం పెట్టించి, ఒడిశాలోని సుంకి వరకు అంబులెన్స్‌లో వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మానవత్వం ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత రోజుల్లో.. భార్యను కోల్పోయి బాధలో ఉన్న నిరుపేద వ్యక్తికి సాయం చేసిన ఏపీ విజయనగరం పోలీసులను స్థానికులు అభినందించారు.
ఇవీ చదవండి: