Girl Suspect Death in Jeedimetla: హైదరాబాద్ శివారు జీడిమెట్ల సుభాష్‌నగర్‌లో బాలిక అనుమానాస్పద మృతిపై బంధువులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో జనం రావటంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.. బాధితులు తనను కలవాలని చెప్పటంతో ఆందోళన విరమించారు.
అసలేం జరిగిందంటే..
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్‌నగర్‌కు చెందిన బాలిక సోమవారం అదృశ్యం కాగా.. తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా తెల్లవారుజామున 3 గంటల సమయంలో మృతదేహం లభ్యమైంది. జీడిమెట్ల పైపులైన్ రోడ్డులోని ఓ బార్ సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలో రక్తపు మడుగులో మృతదేహం లభించింది. అత్యాచారం చేసి హతమార్చారని బాధిత కుటుంబసభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.
రాజకీయ నేతల మద్దతు..
ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నేతలు బాలిక కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే రాజాసింగ్, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ బాధిత తల్లిదండ్రులతో మాట్లాడారు. దిల్లీ భాజపా నేత మంజీందర్ సింగ్ స్పందించి.. 24 గంటల్లో నిందితులను శిక్షించకపోతే.. హైదరాబాద్ వచ్చి భారీ రాస్తారోకో నిర్వహిస్తామని తెలిపారు. బాధిత కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని రాజాసింగ్ పోలీసులను కోరారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు..
నిర్మాణంలో ఉన్న భవనం ఎదురుగా ఉన్న ఓ గదిలో రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. మరోసారి క్లూస్ టీమ్‌ను పిలిపించి ఆధారాలు సేరించారు. జాగిలాలతో గాలింపు చేపట్టారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. బాలిక మృతిపై పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఆ నివేదిక వస్తే ఆ మేరకు ముందుకెళ్లగలమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: