Nepali Robbery Gangs : నేత్రా బహుదూర్‌షాహి, గోవింద్ బహుదూర్ ఈ తరహా నేరాల్లో కరడుగట్టిన ముఠానేతలు. వీరి నేతృత్వంలోని పలు ముఠాలు మెట్రో నగరాలకు విస్తరించాయి. తొలుత ఇప్పటికే ఇళ్లలో నమ్మకంగా పనిచేస్తున్న నేపాలీలను గుర్తించి పరిచయం పెంచుకుంటారు. చోరీ పథకం చెప్పి నయానా భయానో ఒప్పిస్తారు. అదను చూసి ఇల్లు గుల్ల చేస్తారు. ఈ తరహా నేరాల్లో నేపాల్‌లోని కైలాలీ, కాలికోట్, సుర్‌కేత్ ప్రాంత ముఠాలు ఆరితేరినట్లు పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్‌లో మూడేళ్లలో సుమారు రూ.6 కోట్ల సొత్తు చోరీ కాగా 38 మంది నేపాలీ దొంగలపై కేసులు నమోదయ్యాయి. భారత్‌కు వచ్చి ఉత్తరాఖండ్‌లో స్థిరపడిన నేపాలీ కుటుంబాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి హైదరాబాద్, దిల్లీ, అహ్మదాబాద్, ముంబయి, బెంగళూరు, చెన్నై నగరాలకు వచ్చి చోరీలు చేసి ఉత్తరాఖండ్ పారిపోతున్నాయి. ఇటీవల నేపాలీ ముఠాల చోరీలు జరిగితే వెంటనే ఉత్తరాఖండ్ సరిహద్దుల్లోని చెక్‌పోస్టులతోపాటు సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ) బలగాల్ని అప్రమత్తం చేస్తున్నారు. దేశం దాటనీయకుండా చేసి పట్టుకొస్తున్నామని ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.
పోలీసుల అదుపులో నేపాలీ దంపతులు.. కూకట్‌పల్లి వివేకానందనగర్‌లోని వి.దామోదర్‌రావు ఇంట్లో చోరీకి పాల్పడి రూ.55 లక్షల నగదు, నగలతో ఉడాయించిన నేపాలీ దంపతులు చక్రధర్, సీతను, మరోవ్యక్తిని కూకట్‌పల్లి పోలీసులు బెంగళూరు సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. తమకోసం పోలీసులు వెతుకుతారని ముందే ఊహించిన నిందితులు బెంగళూరుకు బస్సులో ప్రయాణించి బుధవారం ఉదయం అక్కడ దిగారు. హైదరాబాద్‌లోని తమ బంధువులను వాకబు చేశారు. పోలీసులు వారి ఫొటోలను ముంబయి, బెంగళూరు, పుణె, భువనేశ్వర్‌కు పంపించారు. వారి ఫోన్ నంబర్లను పోలీసులు విశ్లేషిస్తుండగా ఒక ఆధారం లభించడంతో ఆటకట్టించారు.