మేడ్చల్ జిల్లాలో వారం క్రితం పట్టుబడిన డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు కోర్టులో లొంగిపోయాడు. మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతున్న హన్మంత్రెడ్డి రెండు రోజుల క్రితం ఎల్బీనగర్ కోర్టులో లొంగిపోయాడు. న్యాయస్థానం హన్మంత్ రెడ్డికి 14రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. హన్మంత్రెడ్డిని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని ఎల్బీనగర్ కోర్టులో ఎక్సైజ్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం దీనిపై వాదనలు జరగనున్నాయి.
ఈనెల 23న ఎక్సైజ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 2 కోట్ల రూపాయల విలువైన మెపిడ్రిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో హన్మంత్రెడ్డి, ఎస్కేఎస్ రెడ్డి ప్రధాన నిందితులుగా ఉన్నారు. ఇద్దరు పరారీలో ఉండటంతో ఎక్సైజ్ పోలీసులు గాలించారు.
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం బావాజిపల్లికి చెందిన హన్మంత్ రెడ్డి మాదక ద్రవ్యాలను సరఫరా చేసినట్లు ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో తేలింది. ఎస్కేఎస్ రెడ్డి సాయంతో బెంగళూర్, గోవా, ముంబయి నుంచి మెఫిడ్రిన్ను తీసుకొచ్చి.. నగరంలో పలువురికి హన్మంత్ రెడ్డి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్కేఎస్ రెడ్డి కోసం గాలిస్తున్న ఎక్సైజ్ పోలీసులు... అతన్ని పట్టుకుంటే కీలక సమాచారం రావొచ్చని ఎక్సైజ్ పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి: Drugs Seized in Medchal : రూ.2 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం.. నిందితుల ఇళ్లలో సోదాలు