Man was Tied to Tree: నిజామాబాద్ జిల్లా నవీపేట లింగమయ్య గుట్ట ప్రాంతంలో యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 30న జరిగిన ఈ ఘటనపై నవీపేట పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన పట్టించుకోలేదని బాధితుడి బంధువులు వాపోయారు. దాంతో గురువారం నేరుగా నిజామాబాద్‌కి వెళ్లి సీపీకి ఫిర్యాదు చేశారు. నవీపేట మండల కేంద్రంలోని లింగమయ్య గుట్ట ప్రాంతంలో వ్యక్తిగత కారణాలతో సత్తార్ అనే యువకుడు రోడ్డుపై వెళుతున్న సాజిద్ అన్న కుమారుడిని దూషించాడు. ఇది ఏప్రిల్ 28న చోటుచేసుకుంది. ఆ విషయం సాజిద్‌కి తెలవడంతో అతని ఇంటికి వెళ్లి అడిగాడు. అది మనసులో పెట్టుకున్న వర్గీయులు సాజిద్‌ని గత నెల 30న చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టడంతో తలపై గాయాలయ్యాయి.

గత నెల 28న నవీపేట మండలం లింగమయ్య గుట్ట ప్రాంతంలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ ఘటనలో 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజారెడ్డి గురువారం తెలిపారు. రంజాన్ పండగ ఉండడంతో రిమాండ్‌కి తరలించలేదని తెలిపారు. కాలనీకి చెందిన సత్తార్, సాజిద్ వ్యక్తిగత కారణాలతో గొడవ పడ్డారని తర్వాత ఇరు కుటుంబాల వారు పరస్పరం దాడి చేసుకొన్నారన్నారు. ఈ మేరకు సత్తార్, పెరోజ్, గయాస్, ఆరీఫ్, పరీనా సుల్తానా, సాజిద్, లక్ష్మి, బాసిత్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:Woman Suicide : భర్త సినిమాకు తీసుకెళ్లలేదని.. భార్య బలవన్మరణం