Man Killed His Friend in Tandur : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో శుక్రవారం జరిగిన గుర్తుతెలియని వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడిని సోమవారం రిమాండ్‌కు తరలించారు. తాండూరు డీఎస్పీ శేఖర్‌గౌడ్ తెలిపిన ప్రకారం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్టణానికి చెందిన లక్ష్మణ్ 20 ఏళ్ల కిందట ఉపాధికి తాండూరుకు వచ్చి, సాయిపూరులో ఉంటూ, కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని 12 ఏళ్ల కిందట ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు ఉంది. పాత తాండూరుకు చెందిన అబ్దుల్ కలీంతో లక్ష్మణ్‌కు పరిచయం ఏర్పడింది.
Man Killed His Friend in Vikarabad : ఈ క్రమంలోనే వీరి ఇంటికి వచ్చి వెళుతుండటంతో లక్ష్మణ్ భార్యతో కలీంకు సన్నిహితం పెరిగింది. ఈ విషయం తెలిసి, వాళ్లిద్దరిని అనుమానించి ఆమెను వేధింపులకు గురి చేయడంతో మరో వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియక, కలీం వద్దే తన భార్య ఉందని భావించడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. నా భార్య ఆచూకి చెప్పకపోతే నీ అంతు చూస్తానని కలీంను లక్ష్మణ్ బెదిరించాడు. తనను ఏమైనా చేస్తాడేమోనని అనుమానించి కలీం అతడినే హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.
ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం ఇద్దరూ ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలో మద్యం తాగారు. రాత్రి మళ్లీ అతనికి లక్ష్మణ్ ఫోన్ చేసి రమ్మని ఒత్తిడి చేశాడు. దీంతో కలీం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అతని మిత్రుడు గులాం మహమూద్‌ను తీసుకుని ద్విచక్ర వాహనంపై లక్ష్మణ్ వద్దకు వెళ్లాడు. మద్యం సీసాలు తీసుకుని గ్రీన్‌సిటీలోని నిర్మాణుష్య ప్రాంతానికి ముగ్గురు వెళ్లి కూర్చున్నారు. ఇంతలోనే తనతో తెచ్చుకున్న కత్తితో కలీం లక్ష్మణ్‌పై దాడి చేసి, తల, మెడ మీద నరికాడు. ఈ సంఘటన చూసిన గులాం అక్కడి నుంచి భయంతో పరుగెత్తాడు. లక్ష్మణ్ చనిపోయాడని నిర్ధారించకున్న కలీం కత్తిని అక్కడే పొదల్లో పారేసి పారిపోయాడు.
శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి హత్యగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి, కలీంను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. కేసు పరిష్కారానికి కృషి చేసిన సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్‌ను అభినందించారు. కానిస్టేబుళ్లకు నగదు పురస్కారాన్ని అందించారు.