నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామశివారులోని 44వ జాతీయ రహదారిపై బుధవారం ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన కంఠం సాయిలు(64) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిలు వ్యవసాయ క్షేత్రం నుంచి గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నిజామాబాద్ వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. 44వ జాతీయ రహదారితో తమ గ్రామానికి వచ్చే మలుపు ప్రమాదకరంగా ఉందని, తరచూ అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు పలుమార్లు టోల్ ప్లాజా యాజమాన్యానికి విన్నవించినా పట్టించుకోలేదని వాపోయారు.
యాజమాన్యమే ఈ మృతికి బాధ్యత వహించి, సమస్య శాశ్వత పరిష్కారానికి హామీ ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. మృతదేహంతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. గ్రామస్థుల నిరసనతో రోడ్డుకిరువైపులా మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. యాజమాన్యం వచ్చే వరకు మృత దేహాన్ని తీయబోమని భీష్మించుకూర్చున్నారు. విషయం తెలుసుకున్న డిచ్పల్లి ఎస్సై ఆంజనేయులు, ఏఎస్సై బాల్సింగ్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకొని గ్రామస్థులకు నచ్చజెప్పారు. యాజమాన్యంతో మాట్లాడిస్తానని హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు. అనంతరం పోలీసులు వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. రహదారి మలుపు వద్ద పై వంతెన నిర్మించి ప్రమాదాలు నిర్మూలించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!