Man Brutally Murdered in Khammam: ఖమ్మంలో వివాహేతర సంబంధంతో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి మృతదేహం మాయం చేసిన ఘటన సంచలనం రేపింది. ఆరెంపులకు చెందిన సాయిచరణ్... కొణిజర్ల మండలానికి చెందిన యువతి నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా రోటరీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. చికెన్ వ్యర్థాలు తరలించే డ్రైవర్‌గా సాయి పనిచేస్తున్నాడు. అక్కడే అతడికి కరుణాకర్‌తో పరిచయం ఏర్పడింది. కరుణాకర్ తరచూ.. సాయి ఇంటికి వెళ్లేవాడు. ఈ క్రమంలో అతడి భార్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధంగా మారింది. సాయికి విషయం తెలిసి ఆమెతో గొడవపడ్డాడు. భర్తకు విషయం అర్థమైందని ఇతరులకు తెలిస్తే పరువుపోతుందని ఆమె ప్రియుడికి చెప్పింది. దీంతో సాయిని అంతమొందించడం ఒక్కటే మార్గమని ఇద్దరు భావించారు. అడ్డు తొలగించేందుకు పథకం రచించారు.
చేపల చెరువులో పడేసి.. ఆగస్టు 1వ తేదీ రాత్రి చికెన్ వ్యర్థాలు తీసుకెళ్లేందుకు సాయి, కరుణాకర్ సిద్ధమయ్యారు. మరో ఇద్దరు డ్రైవర్లతో కలిసి మద్యం సేవించారు. ఈ సమయంలో తన భార్యతో ఎందుకు చనువుగా ఉంటున్నావని సాయి కరుణాకర్‌ని నిలదీశాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణ తలెత్తింది. మత్తులో ఉన్న కరుణాకర్.. సాయిని బలంగా తోసేయడంతో ట్రాలీ ఆటోకు గుద్దుకున్నాడు. అనంతరం చికెన్ వ్యర్థాలు తీసే పారతో బలంగా మోదడంతో అక్కడికక్కడే చనిపోయాడు. హత్యపై ఎవరికి అనుమానం రావొద్దని భావించిన కరుణాకర్... మృతదేహాన్ని మూటగట్టి వ్యర్థాలతో పాటు వాహనంలో వేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం కుదుపాకు తీసుకెళ్లి ప్రైవేటు చేపల చెరువులో వ్యర్థాలతోపాటు మృతదేహాన్ని పడేశాడు. బయటకు తేలకుండా బలమైన రాయి కట్టాడు. మూడ్రోజుల తర్వాత తేలటంతో గమనించిన యజమాని.. కరుణాకర్‌కు ఫోన్ చేశాడు. శవాన్ని పక్కనే ఉన్న ఊరి చేపల చెరువులో పడేశాడు. విషయం గురించి ప్రియురాలికి చెప్పాడు.
పోలీసుల అదుపులో నలుగుర.. సాయి ఎక్కడికి వెళ్లాడని బంధువులు, యజమాని అతడి భార్యను ప్రశ్నించారు. ఆమె తెలియదని చెప్పటంతో పదిరోజుల తర్వాత అందరూ కలిసి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... ఫోన్ కాల్ లిస్టు ఆధారంగా విచారణ చేపట్టారు. సాయి భార్య కరుణాకర్‌తో ఎక్కువ సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. ఇద్దరిని విచారించగా..అసలు విషయం ఒప్పుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు... హత్యకు సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగి 25 రోజులు గడుస్తున్నా... మృతదేహం లభ్యం కాలేదు. పోలీసులు త్వరగా కేసును చేధించి మృతదేహం అప్పగించాలని బంధువులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: