సిద్దిపేట జిల్లాలో మల్లన్నసాగర్ ప్రభావిత గ్రామ నిర్వాసితుడు పరిహారం రాలేదన్న బెంగతో గుండెపోటుతో మృతి చెందాడు. తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్తండాకు చెందిన బానోతు హనుమంతుకు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉండేది. ఎనిమిదేళ్ల కిందట ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కాలువ నిర్మాణానికి తీసుకుంటున్నట్లు నోటీసులు ఇచ్చింది. ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే భూమిని స్వాధీనం చేసుకుని కాలువ తవ్వకం పూర్తి చేశారు.
తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెరాస ప్రభుత్వం ప్రాజెక్టు పునర్ నిర్మాణంలో భాగంగా మల్లన్న సాగర్ జలాశయం నిర్మించేందుకు సిద్ధమైంది. భూ సేకరణ చేపట్టిన సమయంలో హనుమంతు కుటుంబానికి చెందిన భూమికి ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. గ్రామానికి వచ్చిన అధికారులు ప్రాణహిత-చేవెళ్ల కాలువ నిర్మాణానికి తన భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఇచ్చిన నోటీసులను ఆయన చూపించారు. వాటిని పరిశీలించిన అధికారులు పరిహారం తర్వాత ఇస్తామంటూ వాయిదా వేస్తూ వచ్చారు. 4 రోజుల క్రితం రెవెన్యూ అధికారులు గ్రామాన్ని మొత్తం ఖాళీ చేయాలని చెప్పగా తనకు పరిహారం ఎప్పుడు చేస్తారో చెప్పాలని హనుమంతు నిలదీశాడు. ప్రాణహిత-చేవెళ్ల సేకరించిన భూమికి ఇప్పుడు పరిహారం ఇవ్వలేమని ప్రత్యేకంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తర్వాత వస్తుందని అధికారులు వివరించారు. తన భూమికి పరిహారం ఇవ్వడం లేదని తీవ్ర ఆందోళనకు గురైన హనుమంతు సోమవారం గుండెపోటుకు గురయ్యాడు.వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. చికిత్స ప్రారంభించే లోగానే హనుమంతు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు హనుమంతు కు భార్య ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు తల్లి ఉన్నారు.
ఇదీ చూడండి: ‘ఆడపిల్లను కనండి... రూ.5 వేలు పొందండి'