Lovers Suicide: ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నారు. కలిసి ఉంటే ఎంత సంతోషంగా గడుపుతామో అంటూ ఊసులు చెప్పుకున్నారు. కానీ చివరికి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బూర్గుపల్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది. బూర్గుపల్లి సమీపంలో వ్యవసాయ బావి వద్ద ప్రేమజంట ఉరేసుకుంది. మృతులు అదే గ్రామానికి చెందిన మాడిశెట్టి అఖిల(17), కోటోజు సాయి(20)గా గుర్తించారు.
అఖిల, సాయి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. ఆ విషయం ఇరువురి కుటుంబాలకు తెలిసింది. దీనితో కుటుంబసభ్యులు వారిద్దరిని మందలించారు. అప్పటికీ ఇంట్లో ఒప్పించాలని ఇద్దరూ భావించారు. కానీ.. ఫలితం లేదు. మరొకరితో బతకడం కంటే చావడమే ఉత్తమం అని నిర్ణయించుకున్నారు. శాశ్వతంగా కలిసి జీవించడం కష్టమని భావించిన ఇరువురు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఆదివారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన వారిద్దరు ఇవాళ చెట్టుకు ఉరేసుకుని మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు. చెట్టుకు వేలాడుతున్న వారిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో బూర్గుపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి: