సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చెందిన వడ్డేపల్లి వెంకటేశం(51)కు భార్య నర్మద, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. 2015లో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డు విస్తరణలో అతడి ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. పరిహారం ఇస్తామన్న అధికారులు పట్టించుకోలేదు. పలుమార్లు తిరిగాక రెండు పడక గదుల ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
వాటి పంపిణీకి లబ్ధిదారులను గుర్తించడానికి ఇటీవలే ఇంటింటి సర్వే ప్రారంభించారు. గురువారం వెంకటేశం ఉంటున్న అద్దె ఇంటికి రాగా వారికి తన కష్టాలన్నీ వివరించాడు. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నానని, కుటుంబ సభ్యులతో పాటు తానూ అనారోగ్యంతో బాధపడుతున్నానని అధికారుల ముందు ఏకరువు పెట్టాడు. వాటి పత్రాలు తెచ్చేందుకు మొదటి అంతస్తు నుంచి కిందకు దిగాడు. తిరిగి రాకపోవటంతో కుటుంబసభ్యులు కిందకు వచ్చి చూడగా అచేతనంగా పడి ఉన్నాడు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సొంతింటి కల నెరవేరకుండానే మృతి చెందిన వెంకటేశాన్ని చూసి స్థానికులు కంటతడిపెట్టారు.
అయిదేళ్లుగా ఇళ్లు లేక పడుతున్న ఇబ్బందులు... ఆర్థికంగా చితికిపోయిన బతుకులు... తనలోన దాగి ఉన్న ఆవేదనను అధికారులకు చెప్పుకున్న వెంకటేశానికి గుండె బరువెక్కింది. ఇప్పటికైనా అధికారులు వచ్చారనే సంతోషం... తన బాధలు తీరిపోతాయనే నమ్మకం... ఇన్నాళ్లుగా తనలోనే దాచుకున్న దుఖఃం కలిసి వెంకటేశం ప్రాణాలను హరించాయి.
ఇదీ చూడండి: Secrets Of Suicide: ఆత్మహత్య కూడా ఒక రోగమే..!