Chemical Leakage in Kukatpally: ఇళ్ళ మధ్య ఏర్పాటు చేసిన ఓ కెమికల్ గోదాంలో, యాసిడ్ లీక్ అయ్యి స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయిన ఘటన కూకట్‌పల్లి సాయిచరణ్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రమణారెడ్డి అనే వ్యక్తి సాయిచరణ్ కాలనీలో ఓ షట్టర్ అద్దెకు తీసుకొని అందులో రసాయనాలను నిలువ ఉంచే గోదాం ఏర్పాటు చేసుకున్నాడు. వాటిని ఫార్మా కంపెనీలకు సరఫరా చేసేవాడు.
ఈ రోజు ఉదయం నిల్వ ఉంచిన వాటిలో నుండి కాన్సంట్రేటెడ్ హైడ్రో క్లోరిక్ యాసిడ్ డ్రమ్ములో నుంచి లీక్ అయ్యింది. దీంతో షట్టర్లో నుంచి పొగలు రావటాన్ని గమనించిన స్థానికులు, గోదాం నిర్వహుకుడికి సమాచారం అందించారు. అతడు ఘటన స్థలానికి చేరుకునే లోపు రసాయనాలు నుంచి విడుదలైన వాయువులతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో, అగ్నిమాపక సిబ్బందితో సహా అక్కడికి చేరుకున్నారు.
ఆ డ్రమ్ములను అక్కడి నుండి తరలించేందుకు వచ్చిన వ్యక్తులు, వాహనదారులు వాసనలు భరించలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. కెమికల్ లీక్ అవటంతో అదే భవనంపై అంతస్తులో ఉండే తాము ఇళ్ల నుంచి బయటకు వచ్చేసామని, ఊపిరి పీల్చుకోవటానికి ఇబ్బంది పడ్డామని, కళ్లు మంటలు పుట్టాయని ఇంటి యజమానురాలు తెలిపింది. కెమికల్ డ్రమ్ములను తీసుకు వెళ్లేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో, కూలీల సహాయంతో ఓ ట్రాలీలోకి డ్రమ్మును ఎక్కించగా, ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆ ట్రాలీనీ నడుపుకుంటూ తీసుకొని వెళ్లటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇవీ చదవండి: