Charminar MLA Attack: హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ఖాన్పై హుస్సేని అలం పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అక్రమాస్తులు కూడబెట్టాడనో.. అక్రమాలు చేశాడనో కాదు.. ఓ స్థానికుడిపై చేయి చేసుకున్నాడని కేసు నమోదయ్యింది. మరి ఓ ఎమ్మెల్యే ఒకరిపై చేయి చేసుకోవాల్సి వచ్చిందంటే.. తనను ఏమైనా దుర్భాషలాడాడో..? దురుసుగా ప్రవర్తించాడో..? లేక చేయరాని తప్పిదమేదైనా చేసుంటాడో..? లేకుంటే ఓ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి.. మరోవ్యక్తికి ఉరికే కొడతాడా...? అనుకుంటే పొరపాటు పడ్డట్టే..! ఇక్కడే ఉంది అసలు విషయం..
అసలు ఏం జరిగిందంటే..
Charminar mla slapped local: 11 తేదీ అర్థరాత్రి సమయంలో.. గులాం గౌస్ జిలాని అనే స్థానికుడు చార్మినార్ పాత బస్టాండ్ సమీపంలో ఉన్న తన నివాసం వద్ద మరో వ్యక్తితో కలిసి కూర్చొని ఉన్నాడు. అదే సమయంలో ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఆ మార్గం గుండా ఇంటికి వెళ్తున్నారు. అక్కడ కూర్చున్న వాళ్లను చూసిన ఎమ్మెల్యే.. కారులో నుంచి దిగి నడుచుకుంటూ గులాం గౌస్ జిలాని వద్దకు వచ్చారు. కాసేపు వారి మధ్య ఏదో సంభాషణ జరిగింది. ఇంతలో.. ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఒక్కసారిగా జిలాని చెంప చెల్లుమనిపించారు. ప్రతిస్పందించిన జిలాని.. ఎమ్మెల్యేపైన ఆగ్రహం వ్యక్తం చేయటంతో గొడవ పెరిగి పెద్దదైంది. ఈ క్రమంలోనే జిలానిపై ఎమ్మెల్యే మరోసారి చేయిచేసుకున్నారు. ఇంతలో.. అక్కడున్న స్థానికులు వచ్చి జిలానీని పక్కకు తీసుకెళ్లారు.
సలామ్ చేయలేదనే కొట్టాడు..!
Complaint on Charminar MLA: ఇదిలా ఉంటే.. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మాత్రం ఆసక్తికరంగా ఉంది. కారులో వెళ్తుంటే సలాం చేయలేదనే కోపంతోనే.. దిగి వచ్చి మరీ ఎమ్మెల్యే తనను కొట్టాడని బాధితుడు జిలానీ.. హుస్సేని అలం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడున్న సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. బాధితున్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించి.. విచారణ చేస్తున్నారు.
సలామ్ చేయనందుకేనా..?
అయితే.. ఈ సీసీదృశ్యాల్లో రికార్డయిన దాని ప్రకారం.. ఎమ్మెల్యే రాగానే జిలానీ లేచి నిలబడి పలకరించినట్టు తెలుస్తోంది. కాసేపు వాళ్లిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు అర్థమవుతోంది. అయితే.. ఆ వాగ్వాదం.. సలాం చేయనందుకా..? లేదా ఇంకే విషయంపైనా..? అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇవీ చూడండి: