రాష్ట్రంలో ఎక్కువ అగ్ని ప్రమాదాలకు సిగరెట్ పీకనే కారణమవుతోంది. పొగ తాగిన అనంతరం సిగరెట్లు లేదా బీడీలను అజాగ్రత్తగా పడేస్తుండడం వల్లే అత్యధికంగా సంభవిస్తున్నాయని రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ తాజా విశ్లేషణ వెల్లడిస్తోంది. రాష్ట్రంలో గత ఏడాది జరిగిన మొత్తం 7,899 అగ్నిప్రమాదాల్లో 4,187 సిగరెట్, బీడీలను నిర్లక్ష్యంగా పడేయడం వల్లే జరిగాయి. ఎలక్ట్రికల్ ఉపకరణాల షార్ట్‌సర్క్యూట్ కారణంగా 1,992 చోటుచేసుకున్నాయి. 2014-20 మధ్య కాలంలో జరిగిన అగ్ని ప్రమాదాల్లోనూ సిగరెట్, బీడీలదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మొత్తం 62,496 ఘటనల్లో నిర్లక్ష్య ధూమపానంతో సంభవించినవి 30,981 ఉన్నాయి. 18,795 ఘటనలతో ఎలక్ట్రికల్ ఉపకరణాల షార్ట్‌సర్క్యూట్ తర్వాతి స్థానంలో ఉంది.
ఏడాదిలో రూ.230.91 కోట్ల నష్టం
రాష్ట్రంలో 2020 సంవత్సరంలో రూ230.91 కోట్ల ఆస్తి నష్టం జరగగా అగ్నిమాపక సిబ్బంది రూ.959.85కోట్ల ఆస్తిని కాపాడారు. 457 మంది ప్రాణాలు కోల్పోగా.. 990 మందిని రక్షించగలిగారు. అగ్నిప్రమాదాలు కాకుండా ఇతర ఘటనల్లో 1,056 మంది ప్రాణాలు కోల్పోగా 2,614 మందిని రక్షించారు. 2014 నుంచి చూస్తే 2015లో అత్యధికంగా 147 భారీ ప్రమాదాలు సంభవించగా 2020లో 99 చోటుచేసుకున్నాయి.