Khiladi Lady Cheating: కొండాపూర్ ప్రాంతానికి చెందిన హితేష్, రజనీ (పేర్లుమార్చాం) ఆలుమగలు. పెళ్లయి నాలుగేళ్లవుతుంది. భర్త అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. కేంద్రసర్వీసులకు ఎంపిక కావాలని భార్య పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. బోలెడు ఆస్తి పాస్తులు.. ఆర్ధిక ఇబ్బందులు లేకపోయినా.. సివిల్స్ పరీక్షల్లో నెగ్గేంత వరకూ సంతానం వద్దనుకున్నారా దంపతులు. సాఫీగా సాగుతున్న సంసారంలో అనుకోని అతిథి రూపంలో ఆపద వచ్చిపడింది. సామాజిక మాధ్యమాల ద్వారా రజనీకి పొరుగు రాష్ట్ర యువతి పరిచయమైంది. తాను కూడా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నానంటూ మాట కలిపింది. హైదరాబాద్ వచ్చి చదువుకుంటానంటూ.. కొద్దిరోజులు వారింట్లో ఉంటానంటూ కోరింది. వారు అంగీకరించటంతో నగరం వచ్చి దంపతులుంటున్న ప్లాట్‌లోని మరో గదిలోకి చేరింది. 1-2 నెలలు గడిచాక.. ఆ యువతి అసలు రూపం బయటపడింది. హితేష్ అంటే తనకు ఇష్టమని.. పెళ్లి చేసుకుంటానంటూ సంతోషంగా సాగుతున్న కాపురంలో చిచ్చుపెట్టింది. స్నేహితురాలి రూపంలో కొత్త సమస్య తలెత్తటంతో బార్యభర్తలు ఆ యువతి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు కూడా ఆ యువతి వైపు మొగ్గు చూపారు. ఇద్దరు భార్యలతో హాయిగా ఉండవచ్చంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. బయటకు తెలిస్తే పరువుపోతుందనే భయం.. వదిలించుకుందామంటే ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందే గుబులు. కేసు నమోదు చేస్తే గొడవ పెద్దదవుతుందని.. ఏదో విధంగా తమ సమస్యను పరిష్కరించమంటూ పోలీసు అధికారులను ఆశ్రయించినట్టు సమాచారం.
వలపు వల.. గిలగిల.. ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ప్రేమ, పెళ్లి, స్నేహం ముసుగులో మాయగాళ్లే కాదు.. కిలేడీలు వలపు వల విసురుతున్నారు. తమ మాటలు నమ్మి దగ్గరైన వారి బలహీనతలను అవకాశం చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో తరచూ ఈ తరహా మోసాలు వెలుగు చూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కొత్తగా ఏర్పడిన పరిచయాలతో అవతలి వారి మాటలను గుడ్డిగా నమ్మటం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. మాదాపూర్‌లోని ఐటీ కంపెనీలో పనిచేస్తున్న యువకుడు(26)కి మంచి జీతం. డబుల్ బెడ్‌రూమ్ ప్లాటున్నాయి. అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగినితో సహజీవనం చేస్తున్నాడు. ఇటీవలే ఆమెకు అంతకుముందే పెళ్లయినట్టు ఆ యువకుడికి తెలిసింది. దీంతో ఊళ్లో తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇది తెలిసిన ఆమె.. డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్ తన పేరిట రాసివ్వాలంటూ డిమాండ్ చేసింది. కాదంటే.. ఇద్దరూ కలిసున్న ఫొటోలను బయటపెడతానంటూ బెదిరించింది. ఇప్పటి వరకూ వాట్సాప్ ద్వారా నగ్న/అర్ధనగ్న ఫొటోలతో ఆకట్టుకున్న మాయగాళ్లు అందినంత సొమ్ము కాజేసేవాళ్లు. ప్రస్తుతం ఇంటికే చేరి వలపు వల విసిరి కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నారని సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్తవారికి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేముందు వాస్తవాలను తెలుసుకోవాలని సూచిస్తున్నారు.
ఇవీ చదవండి: