Karvy Scam:మదుపరుల షేర్లు తమవేనంటూ కార్పొరేటు బ్యాంకుల్లో రుణాలు తీసుకుని మోసం చేసిన.. కార్వీ స్టాక్‌బ్రోకింగ్ అక్రమాలపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో అభియోగ పత్రాలను సమర్పించారు. బ్యాంకుల ప్రతినిధులు, మదుపరుల ఫిర్యాదుల మేరకు నాలుగు కేసులు నమోదు చేసిన పోలీసులు కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ రూ.3,520 కోట్లు స్వాహా చేసిందని గుర్తించారు. ఎనిమిదేళ్లలో ఈ మోసాలు చేశారని సాక్ష్యాధారాలు సేకరించారు. వీటికి సంబంధించిన వివరాలను సెబీ, ఎన్ఎస్ఈ, ఇన్‌కమ్ టాక్స్, ఆర్బీఐ, ఆర్వోసీ కార్యాలయాల నుంచి వివరాలు తీసుకున్నారు. ఐదువేల పత్రాలతో కూడిన సాక్ష్యాధారాలను ఏసీపీ ఎస్వీ హరికృష్ణ మూడ్రోజుల క్రితం కోర్టుకు సమర్పించారు. ఇండస్ ఇండ్ బ్యాంక్ ప్రతినిధుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు... కార్వీ స్టాక్‌బ్రోకింగ్ ఛైర్మన్ సి.పార్థసారథి సహా ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెంగుళూరు జైల్లో ఉన్న పార్థసారథిని పీటీ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చాక కార్వీ అక్రమాల చిట్టాను కోర్టుకు నివేదించనున్నారు.
షేర్లు తమవే అంటూ..
Karvy Scam update: కార్వీ సంస్థలోని 2 లక్షల మంది షేర్లు తమవే అంటూ ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల నుంచి పార్థసారథి 8ఏళ్ల క్రితం వేర్వేరుగా రుణాలు తీసుకున్నారు. మదుపరుల ఖాతాల్లోని రూ.720 కోట్లను కార్వీ రియాల్టీ, సోలార్ పవర్ కంపెనీలకు మళ్లించారు. రెండేళ్ల క్రితం కొందరు వినియోగదారులు ఈ విషయాన్ని సెబీకి ఫిర్యాదు చేయగా... కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సంస్థ ట్రేడింగ్‌పై నిషేధం విధించింది. అప్పటి నుంచి కార్వీ సీఎండీ పార్థసారథి రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల ప్రతినిధులు వేర్వేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మదుపరుల షేర్లను తనఖా ఉంచి రుణాలు
మదుపరుల షేర్లు తనఖా ఉంచి, బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న కార్వీ సంస్థ ఛైర్మన్ పార్థసారథి.. వాటిని సొంతానికి వినియోగించుకునేందుకు కార్వీ వెల్త్, రియాల్టీ సంస్థలకు మళ్లించాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.2800 కోట్ల రుణాన్ని వేర్వేరు సంస్థలకు మళ్లించేందుకు 20 డొల్ల కంపెనీలను ప్రారంభించాడు. అన్ని కంపెనీలకు నష్టాలు వచ్చాయంటూ బ్యాలెన్స్ షీట్లలో చూపించారు. ఈ డొల్ల కంపెనీల కార్యకలాపాలను పర్యవేక్షించిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు వృత్తి నిపుణులు, వ్యాపారులు మదుపు చేసిన రూ.55 కోట్లనూ కార్వీ సంస్థ సొంతానికి వినియోగించుకుందని దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో ఇప్పటి వరకూ 120 మంది సాక్షులను విచారించారు. వేల సంఖ్యలో పత్రాలు, కార్వీ స్టాక్‌బ్రోకింగ్ సంస్థలో కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: