youtube channels owners arrested: సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా థంబ్ నెయిల్స్ పెడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ తెలిపారు. ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండా వార్తా ఛానళ్ల తరహాలో.. తప్పుడు సమాచారంతో పోస్టులు పెట్టినట్లు పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. 'జీఎస్‌ఆర్' అనే యూట్యూబ్ ఛానల్‌తో పాటు 'రైట్ ఆఫ్ వాయిస్ ఛానల్'కు చెందిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. జీఎస్‌ఆర్ ఛానల్ సీఈఓగా చెప్పుకుంటున్న గుండ శివరాంరెడ్డిపై నాలుగు కేసులు, రైట్ ఆఫ్ వాయిస్ ఛానల్ యజమాని ప్రవీణ్‌రెడ్డిపై ఒక కేసు నమోదు చేసినట్లు సీపీ పేర్కొన్నారు.
అనుమతి పొందకుండానే...
'జీఎస్‌ఆర్, రైట్ ఆఫ్ వాయిస్ అనే యూట్యూబ్ ఛానళ్లకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో రిజిస్ట్రేషన్ కానీ, అక్రిడేషన్ సర్టిఫికేట్ కాని లేదు. కొంతమంది విలేకర్లను స్టాఫ్ రిపోర్టర్లుగా తీసుకుని పనిచేయించుకుంటున్నారు. కొన్ని వార్తా ఛానళ్లు పెట్టిన ఫొటోలను తీసుకుని వాటిని వక్రీకరిస్తూ ట్యాగ్స్, థంబ్ నెయిల్స్ పెడుతున్నారు. ప్రధాన వార్తా పత్రికల కంటే ముందుగానే మీడియా సమావేశాలకు, సంఘటనా స్థలాలకు చేరుకుని వార్తలను సేకరించి.. బాధ్యత గల పదవిలో ఉన్న వారిపై పెట్టకూడని రీతిలో కామెంట్లు పెడుతున్నారు. ఇక ముందు ఇలాంటి వాటిపై ఉపేక్షించేది లేదు. ఇతరుల మనోభావాలను దెబ్బతినేలా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటాం.'
--- వి. సత్యనారాయణ, కరీంనగర్ సీపీ
కఠిన చర్యలు తప్పవు
మీడియాకు చెందిన వారిగా చెప్పుకుంటూ ప్రధాన వార్తా ఛానళ్ల కంటే ముందే మీడియా సమావేశాలకు చేరుకుని వార్తలను సేకరించి వాటిని వక్రీకరిస్తున్నారని సీపీ సత్యనారాయణ పేర్కొన్నారు. ఇది కేవలం బాధ్యత గల పదవిలో ఉన్న వారిపైనే కాకుండా.. ఏ ఒక్కరినీ కించపరిచే విధంగా పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. వీటిని నిర్మూలించేందుకు ఏసీపీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ సత్యనారాయణ వివరించారు.
ఇదీ చదవండి: MLC Jeevan reddy about Raghava : 'రాఘవ దురాగతాలపై సిట్ ఏర్పాటు చేయాలి..'