Inter Student Suicide: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. పెద్ద ఎక్లారగేట్ వద్ద గల బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గురుకుల ప్రాంగణంలోని నీటిట్యాంక్‌లో దూకి శిరీష అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
Inter Student Suicide at Madnoor: తెల్లవారుజాము నుంచి విద్యార్థిని కనిపించకపోవడంతో సిబ్బంది ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో నీటిట్యాంక్‌లో నిర్జీవంగా పడి ఉండటం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతురాలి స్నేహితులను ఆరా తీశారు. వసతిగృహంలోని ఆమె గదిలో ఆత్మహత్య లేఖను పోలీసులు గుర్తించారు. ఇంట్లో, పాఠశాలలో తగిన గుర్తింపు దక్కడం లేదని మనస్తాపానికి గురై చనిపోతున్నట్లు లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. విద్యార్థిని నిజాంసాగర్ మండలం గాలిపూర్ గ్రామానికి చెందిందని ప్రిన్సిపల్ సవిత చెప్పారు.
విషయం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాలకు పరుగులు తీశారు. కళ్లెదుటే కన్నబిడ్డ విగత జీవిగా పడి ఉండటం చూసి గుండెలవిసేలా రోదించారు. వారిని చూసిన సిబ్బంది, విద్యార్థినులు కంట తడి పెట్టారు.
"స్కూల్ ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. మా దర్యాప్తులో ఆమె చనిపోవడానికి ముందు ఓ నోట్‌బుక్‌లో రాసిన లేఖ గుర్తించాం. 'నేను నా జీవితంలో ఏం సాధించలేకపోతున్నాను. ఎవరికి మంచి పేరు తీసుకురాలేకపోతున్నాను. నాకు జీవితం మీద విరక్తి కలుగుతోంది' అని లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడింది."
- కృష్ణ, బిచ్కుంద సీఐ