దేశ, రాష్ట్ర ప్రజలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి మహిళలకు కొత్త కష్టాలు తెచ్చింది. లాక్‌డౌన్, ఇంటి నుంచి పని విధానంతో కుటుంబ సభ్యులు ఇంటికి పరిమితం కావడంతో వారు అధిక వేధింపులకు గురవుతున్నారు. మాట వినలేదని, చెప్పింది చేయడం లేదని చీటికి మాటికి గొడవలు, భౌతిక దాడులు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలో రెండున్నరేళ్లలో గృహహింస ఫిర్యాదులు భారీగా పెరిగాయి. మహిళా సహాయ కేంద్రం ఏర్పాటు చేసిన రెండేన్నరేళ్లలో వచ్చిన ఫిర్యాదులు కన్నా కరోనా కాలంలోనే ఎక్కువగా నమోదయ్యాయి. రోజుకు సగటున సుమారు 28 చొప్పున ఏడాది కాలంలో 10,338 కేసులు నమోదయ్యాయి.
మార్చి నాటికి 10,338 కేసులు
ఆపదలోని మహిళల్ని రక్షించేందుకు మహిళా శిశు సంక్షేమశాఖ 2017 ఆగస్టులో 24 గంటలూ పనిచేసే మహిళా సహాయ కేంద్రం-181ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి గత ఏడాది ఫిబ్రవరి వరకు 8,148 గృహహింస కేసులు నమోదైతే... కరోనా కాలంలో 2021 మార్చి వరకు 10,338 కేసులు వచ్చాయి. అలాగే లైంగిక వేధింపులు, దాడుల కేసులూ ఎక్కువయ్యాయి. రెండున్నరేళ్లలో 380 కేసులు వస్తే గతేడాది ఏడాది ఏప్రిల్ నుంచి మార్చి వరకు 975 కేసులు నమోదయ్యాయి.
పిల్లలపై పైశాచికత్వం...
మానవ మృగాలతో చిన్నారులూ ముప్పును ఎదుర్కొంటున్నారు. ఏడాది కాలంలో చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులు 241 నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 491 కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: హోం ఐసోలేషన్‌లోనే నగరవాసులు.. సగానికి తగ్గిన పరీక్షలు