Illegal Registration: సర్కార్ ఎన్ని సంస్కరణలు చేసినా.... ఎంత కఠినంగా వ్యవహరించినా.... తమలో మాత్రం మార్పు రాదంటూ మరోసారి నిరూపించారు రెవెన్యూ అధికారులు. బతికున్న వృద్ధురాలి పేరున ఉన్న భూమిని అక్రమణదారులకు తహసీల్దార్ కట్టబెట్టిన ఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలో వెలుగు చూసింది.
భూమిని అంజమ్మ పేరు మీద మార్చిన తహసీల్దార్: రాయికోడ్ మండలం నాగన్‌పల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల హన్మంత్ రెడ్డికి సర్వే నంబర్ 198లో 27ఎకరాల 34 గుంటల భూమి ఉంది. గతేడాది ఆయన చనిపోగా ఆ భూమిని భార్య శివమ్మ పేరిట ఫౌతీ చేయించారు. భర్త మరణించటంతో ఆమె హైదరాబాద్‌లోని కుమారుల వద్ద ఉంటోంది. ఆ 27 ఎకరాలపై కన్నేసిన హన్మంత్‌రెడ్డి సోదరి శివమ్మ మరణించిందంటూ ఆ భూమిని తన పేరు మీదగా మార్చాలంటూ తహసీల్దార్ కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకుంది. శివమ్మ పేరున ఉన్న భూమి మార్చుకునేందుకు హన్మంత్‌రెడ్డి మరణ ధ్రువీకరణ పత్రాన్ని అధికారులకు ఆమె సమర్పించింది. తన అన్న మరణధ్రువీకరణ పత్రం తీసుకోని, శివమ్మ పేరు మీద ఉన్న భూమినంతా తహసీల్దార్ రాజయ్య, రెవెన్యూ అధికారులు ఈ నెల10న అంజమ్మ పేరు మీదకు మార్చేశారు.
ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు శివమ్మ సంగారెడ్డి కలెక్టర్‌ను ఆశ్రయించి, ఆ భూమికి సంబంధించిన ఆధారాలను సమర్పించింది. కలెక్టర్ సూచనతో నేరుగా ఆమె పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అనంతరం అక్రమంగా భూమి రిజిస్ట్రేషన్ చేసిన తహసీల్దార్ రాజయ్యతో పాటు అంజమ్మపై బాధితురాలు రాయికల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఇవీ చదవండి: