Hyderabad family died: కర్ణాటకలోని రాయచూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన రాయచూర్ జిల్లా సింధనూర్ వద్ద బాలాజీ క్యాంపు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భర్త, భార్య, ఇద్దరు పిల్లలు దుర్మరణం పాలయ్యారు.
మృతులను ప్రదీప్ (35), పూర్ణిమ (30), జితిన్ (12), మహీన్ (7)గా గుర్తించారు. గోవా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. సమాచారం తెలుసుకున్న వెంటనే బలగనూరు పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతుడి బంధువులను సంప్రదించి సమాచారం తెలుసుకున్నారు. లారీ డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. బలగనూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.