తెలుగు అకాడమీ డిపాజిట్ల కుంభకోణం (Telugu Akademi Fd Scam) కేసులో కీలక పాత్ర పోషించిన సాయికుమార్ తన అనుచరులతో కలిసి గత 10 ఏళ్ల కాలంలో దాదాపు 200 కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్లు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీ హౌసింగ్ బోర్డులో రూ.40 కోట్లు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో రూ.15 కోట్లు, మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రూ.45 కోట్లు, ఏపీ సీడ్స్ కార్పొరేషన్‌లో రూ.15 కోట్ల డిపాజిట్లను దారి మళ్లించి విత్‌డ్రా చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు తగిన ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సాయికుమార్ ముఠా వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు.
తెలుగు అకాడమీ నిధులు రూ.64.5 కోట్లను (telugu akademi case latest news)గోల్‌మాల్ చేసిన కేసులో సాయికుమార్‌తో పాటు 9 మంది నిందితుల కస్టడీ ముగిసింది. దీంతో మంగళవారం.. నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో పురోగతి కోసం నిందితులు పంచుకున్న వాటాల గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు 9 మందిని మరో నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. దీనిపై వాదనలను ఈనెల 16కు కోర్టు వాయిదా వేసింది. ఇదే కేసులో ఈనెల 9న అరెస్ట్ చేసిన వినయ్‌కుమార్, రమణారెడ్డి, భూపతిలను నాంపల్లి కోర్టు నాలుగు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈనెల 16న వీరిని సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి(ccs police investigation) తీసుకొని ప్రశ్నించనున్నారు.
ఎవరీ సాయికుమార్...
చుండూరి వెంకట కోటి సాయికుమార్ అలియాస్ సాయికుమార్. 49ఏళ్ల ఎంకామ్ పట్టభద్రుడు. ఆర్థిక వ్యవహారాల్లో దిట్ట. బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల లెక్కలు.. ప్రభుత్వ శాఖల్లో నిధులను బ్యాంకుల్లో ఎఫ్‌డీలు చేయించడంలో దిట్ట. అంబర్‌పేట్ డీడీ కాలనీలో నివాసముంటున్న సాయికుమార్ ఎంకామ్ తర్వాత ఛార్టెడ్ అకౌంటెంట్ అయ్యేందుకు ఐసీడబ్ల్యూఏ కూడా పూర్తి చేశాడు. దాంతో పెద్దగా ఆదాయం రాదని గ్రహించి బషీర్‌బాగ్‌లో ఓ కంప్యూటర్ సెంటర్ ప్రారంభించాడు. టీవీ ఛానెల్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేశాడు.
పన్నెండేళ్ల క్రితం చెన్నైకి చెందిన కొందరు వ్యక్తులు రమేశ్‌ను కలిశాడు. వారు ఓ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 6 కోట్లు బదిలీ చేస్తామని, కమీషన్ రూ. కోటి ఇస్తామని వివరించగా సాయికుమార్ సరేనన్నాడు. సదరు వ్యక్తులు రూ. 6 కోట్లు జమచేయగా రూ.కోటి కమీషన్ తీసుకుని వారికి రూ. 5 కోట్లు ఇచ్చేశాడు. కొద్ది రోజులకు సీబీఐ అధికారులు సాయికుమార్‌ను అరెస్ట్ చేశారు. నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్ చెన్నైకి చెందిన రూ. 25 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల వ్యవహారంలో నిందితులకు సహకరించినందుకు అరెస్ట్ చేశామని చెప్పారు. కొద్దినెలలు జైల్లో ఉండి వచ్చిన సాయికుమార్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల మోసాలపై దృష్టి కేంద్రీకరించాడు.
ఏపీ మైనార్టీ కార్పొరేషన్‌లో..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ మైనార్టీ కార్పొరేషన్.. పిల్లలకు ఉపకార వేతనాల పంపిణీ, ఇతర కార్యకలాపాలను నిర్వహిస్తుండేది. తొమ్మిదేళ్ల క్రితం మైనార్టీ కార్పొరేషన్ అధికారులను కలిసిన సాయికుమార్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తే వడ్డీలు ఎక్కువగా వస్తాయని నమ్మించాడు. తన సహచరుడు నండూరు వెంకటరమణతో కలసి పథకం రచించాడు. విజయా బ్యాంక్ కోఠీ శాఖలో మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయించాడు. ఆ ఫిక్స్‌డ్ డిపాజిట్లను అప్పటికే ఆ బ్యాంక్‌లో తప్పుడు పేర్లతో తెరిచిన పదిహేను ఖాతాల్లోకి మళ్లించి డబ్బులు తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు సాయికుమార్‌ను అరెస్ట్ చేశారు.
ఈసారి హౌసింగ్ బోర్డులో..
బెయిల్‌పై బయటకు వచ్చిన సాయికుమార్ ఈసారి ఏపీ హౌసింగ్‌బోర్డు, కాలుష్య నియంత్రణమండలిపై కన్నేశాడు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను గమనించాడు. ఆ రెండు సంస్థలతో సంబంధమున్న ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో పరిచయమున్న వ్యక్తిని ఆరేళ్ల క్రితం కలిశాడు. ఆయన అంగీకరించడంతో ఈ సారి మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ప్రస్తుతం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో మాజీ అధికారిని కలుసుకున్నాడు. అనంతరం హౌసింగ్‌బోర్డు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను వేర్వేరుగా కలుసుకుని ఫిక్స్‌డ్ డిపాజిట్ల విషయాన్ని వివరించాడు. వారు సరేననడంతో ఎస్‌బీహెచ్ మెహిదీపట్నం, సింగపూర్ టౌన్‌షిప్, మల్కాజిగిరి, ఖమ్మంలోని మరో బ్యాంక్‌లో ఎఫ్‌డీలను తెరిచాడు. కొద్దిరోజులకే వాటిని విత్‌డ్రా చేసుకున్నారు. సీబీఐ కేసు నమోదు చేసి ఐదేళ్ల క్రితం సాయికుమార్‌ను ముంబయిలో అరెస్ట్ చేసింది.
ఏపీ హౌసింగ్ బోర్డు నిధులు స్వాహా చేసిన అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహించిన సాయికుమార్ బృందం.. ఏడాది క్రితం తెలుగు అకాడమీ(Telugu Akademi Case) నిధుల గురించి తెలుసుకుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ అంతగా ఉండదని గ్రహించిన సాయికుమార్.. గతంలో తాను అమలు చేసిన ప్రణాళికను పరిస్థితులకు అనుగుణంగా మార్చాడు. ఈ సారి నేరుగా బ్యాంక్ మేనేజర్లను కలుసుకుని కమీషన్ ఇస్తానంటూ ప్రలోభపెట్టాడు. తెలుగు అకాడమీ(Telugu Akademi Case) ఏవోకూ రూ.కోట్లలో ఇస్తానని చెప్పాడు. దశలవారీగా రూ. 64.05 కోట్లు కొల్లగొట్టాడు. ఈ గోల్‌మాల్ వ్యవహారంలో సాయికుమార్ రూ. 20 కోట్లు తీసుకున్నాడని విశ్వసనీయంగా తెలిసింది. ఈ డబ్బు ఎలా ఖర్చుచేశాడు? ఏం చేశాడన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.