జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆడపిల్లలు పుట్టారనే కారణంతో పచ్చి బాలింతను గొంతు నులిమి భర్తే చంపిన(Husband killed wife) ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గద్వాల జిల్లా మల్దకల్ ఎంపీపీ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న గద్వాలకి చెందిన మెదరి వెంకటేశ్... తన భార్య పల్లవిని గొంతు నులిమి చంపేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆడపిల్లలు పుట్టారనే కారణంతోనే తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడని(Husband killed wife) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం వేధింపులే..
గద్వాల పట్టణం నల్లకుంట ఈదమ్మ గుడి దగ్గర నివాసం ఉంటున్న వెంకటేశ్‌కు వనపర్తి జిల్లా మదనాపురానికి చెందిన ఆంజనేయులు కూతురు పల్లవిని ఇచ్చి 2009లో వివాహం చేశారు. కట్నంగా ఆరు తులాల బంగారం, రూ.6లక్షల నగదు ఇచ్చినట్లు మృతురాలి తండ్రి తెలిపారు. తన కూతురిని అదనపు కట్నం కోసం నిత్యం వేధించేవాడని ఆరోపించారు. పల్లవికి మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టిందని వేధింపులకు గురిచేశాడని అన్నారు. ఈ నెల 22న రెండో కాన్పులోనూ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని ... అందుకే ఈ నెల 25న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పల్లవితో గొడవకు దిగాడని పేర్కొన్నారు. ఈ ఘర్షణలో భర్తే గొంతు నులిమి పల్లవిని హతమార్చాడని(Husband killed wife) ఆరోపిస్తున్నారు.
ఆరు లక్షల రూపాయలు నగదు ఇచ్చినం. ఆరు తులాల బంగారు నగలు ఇచ్చినం. పెండ్లి అయిన రెండు నెలలు బాగానే ఉంది. తర్వాత అన్ని కష్టాలే. తొలుత కాన్పుకు మేమే తీసుకపోయినం. అయిదు నెలల వరకు వాళ్లు చూడలేదు. ఆడపిల్ల అని చెప్పినా రాలేదు. మంచిగా తొట్టెల ఫంక్షన్ చేసి తోలినం. అప్పటి నుంచి మా ఇంటికి రాలేదు. మేం వాళ్ల ఇంటికి పోయినా రానీయలేదు. ఆడపిల్లలు పుట్టినారని టార్చర్ పెట్టారు. బాలింతను కొట్టి, గొంతు పిసికి చంపేశాడు.
-మృతురాలి తండ్రి
సెప్టెంబర్ 22న నా బిడ్డకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. మొదటి బిడ్డ పుట్టినప్పుడే టార్చర్ పెట్టిండు. మళ్లీ ఇద్దరు పిల్లలు పుట్టినప్పుడు వేధిస్తున్నాడని నా బిడ్డ చెప్పింది. నేను తీసుకుపోయి పెంచుతానని అన్నాను. నా బిడ్డను చంపినట్లు మా అల్లుడు ఒప్పుకున్నాడట.
-మృతురాలి తల్లి
దర్యాప్తు ప్రారంభం
అపస్మారక స్థితిలో ఉన్న పల్లవిని గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా... మార్గంమధ్యలోనే మృతి చెందిందని ఆమె తల్లిదండ్రులు తెలిపారు. పల్లవి తండ్రి ఆంజనేయులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Clue In Gachibowli Theft Case: ఆ కేసులో అన్నిదారులు మూసుకుపోయిన వేళ.. వరంలా దొరికింది!