Husband killed Wife In Paderu Agency: మద్యం మత్తులో భార్యను హత్యచేసి.. మత్తు దిగాక తాను చేసిన తప్పు తెలుసుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో చోటు చేసుకుంది.
ఇదీ జరిగింది...
చింతపల్లి మండలం లోతుగడ్డ పంచాయతీ మారుమూల రామారావుపేటలో గణపతి, తులసి దంపతులు నివసిస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు. గత కొన్ని రోజులుగా గణపతి మద్యానికి బానిసయ్యాడు. రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్య తులసితో గొడవపడుతుండేవాడు. సోమవారం రాత్రి కూడా ఎప్పటిలాగే ఫూటుగా మద్యం తాగిన గణపతి.. ఇంటికి వచ్చి భార్యతో గొడవపడసాగాడు. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో విచక్షణ కోల్పోయిన అతను అక్కడే ఉన్న గొడ్డలితో భార్య తులసి తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే చనిపోయింది.
అనాథలైన పిల్లలు
అనంతరం మద్యం మత్తులో ఉన్న గణపతి ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు. ఉదయం లేచిన గణపతి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న భార్యను చూసి కంగుతున్నాడు. రాత్రి జరిగిన ఘర్షణను గుర్తు చేసుకున్నాడు. మైకంలో తాను చేసిన తప్పేంటో గ్రహించి.. అదే గొడ్డలితో తన మెడపై నరుక్కున్నాడు. గమనించిన చుట్టుపక్కల వారు అపస్మారక స్థితిలో ఉన్న గణపతిని చింతపల్లి ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడటంతో చికిత్స పొందుతూ గణపతి మృతి చెందాడు. గణపతి మద్యం మత్తులో చేసిన పని వారి ఇద్దరు పిల్లలను అనాథలుగా మార్చిందని బంధువులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి : CCTV video: లిఫ్ట్ కోసం వేచిచూస్తుంటే.. బంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు.!