కరోనా మహమ్మారి.. రాష్ట్రంలో కల్లోలం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడిన ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. మరికొందరు భయంతోనే ఊపిరి వదులుతున్నారు. కొవిడ్‌కు బలవుతున్న వారి అంత్యక్రియలు జరిపించడం రోజురోజుకు క్లిష్టంగా మారుతోంది. మృతదేహాలను తరలించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో సాధారణ మరణమే అయినా.. కరోనా సోకిందేమోనన్న భయంతో దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కామారెడ్డి పట్టణంలో భిక్షాటన చేసి కాలం వెళ్లదీసే ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.
రైల్వే స్టేషన్‌లో భిక్షాటన చేసుకుని కాలం వెల్లదీస్తున్న నాగలక్ష్మి అనే యాచకురాలు ఆదివారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయింది. ఆమె కరోనాతోనే మృతి చెంది ఉంటుందని భావించి మృతదేహం వద్దకు ఎవరూ వెళ్లలేరు. చివరకు శ్మశానవాటికకు తరలించేందుకు ఆటో వాళ్లూ ముందుకు రాలేదు. మృతురాలి భర్త స్వామికి రైల్వే పోలీసులు 2,500 రూపాయలు విరాళంగా సేకరించి అంత్యక్రియల కోసం సాయం చేశారు. నాగమణి భర్త స్వామి.. భార్య మృతదేహాన్ని భుజాలపై మోసుకొని కిలోమీటరు దూరంలోని ఇందిరానగర్ శ్మశాన వాటికకు చేర్చి అంత్యక్రియలు జరిపించారు.
- ఇదీ చదవండి : కరోనా సోకిందని భార్య గొంతు కోసి చంపిన భర్త