Pregnancy drama: గర్భవతి అని చెప్పి 9 నెలల పాటు తిప్పించుకుని.. తీరా ప్రసవం తేదీన వెళితే కాదని చెప్పారని ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి కమలాదేవి విలేకరులకు తెలిపిన కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన మహాలక్ష్మికి యానాంకు చెందిన వి.సత్యనారాయణతో కొన్నేళ్ల కిందట వివాహమైంది.
Fake Pregnancy : ఈ ఏడాది జనవరిలో తన భార్యను వైద్య పరీక్షల కోసం కాకినాడ గాంధీనగర్‌లోని రమ్య ఆసుపత్రికి సత్యనారాయణ తీసుకొచ్చారు. ఆరోజు పరీక్ష చేసిన వైద్యులు మహాలక్ష్మి గర్భవతి అని రిపోర్టు ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె పరీక్షల కోసం తరచూ ఆసుపత్రికి వచ్చేవారు. వైద్యులు స్కానింగ్, మందులు రాసిచ్చేవారు. ఆరో నెలలో స్కానింగ్ తీసి, సెప్టెంబరు 22న ప్రసవం అవుతుందని చెప్పారు. ఆ తర్వాత మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లారు.
కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు స్కానింగ్ తీసి మీ అమ్మాయి అసలు గర్భవతే కాదని చెప్పారు. హుటాహుటిన మహాలక్ష్మిని కాకినాడ రమ్య ఆసుపత్రికి తీసుకొచ్చి స్కానింగ్ తీయాలని ఒత్తిడి చేశారు. వైద్య సిబ్బంది స్కానింగ్‌కు పంపారు. స్కానింగ్ తీసే వ్యక్తి.. మహాలక్ష్మి గర్భంలో శిశువు లేదని చెప్పారు. ఇదేమిటని వైద్యురాలిని ప్రశ్నించగా.. ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పారు.
తొమ్మిది నెలల నుంచి తమను ఆసుపత్రికి తిప్పి రూ.వేలల్లో డబ్బులు ఖర్చు పెట్టించారని కమలాదేవి వాపోయారు. బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందంటూ ప్రతి నెలా మందులు రాసిచ్చారని, వాటిని వాడాక తమ కుమార్తె పొట్ట పెద్దదైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి ఎదుట వారు ఆందోళనకు దిగారు. బాధితులకు మహిళా సంఘాలు మద్దతు తెలిపాయి.
ఇవీ చదవండి: