తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేదంటే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని యువకుడు వేధించడంతో భరించలేక ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఏఎస్సై చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం.. బోయినపల్లి మండలం తడగొండకు చెందిన త్రిష (18) గంగాధరలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన సహ విద్యార్థి సతీశ్ తనను పెళ్లి చేసుకోవాలంటూ ఆమెను తరచూ వేధించేవాడు.
త్రిష ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలపగా.. వారు సతీశ్‌ను కట్టడి చేయాలంటూ అతడి తల్లిదండ్రులకు సూచించారు. సోమవారం త్రిష ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నన్ను పెళ్లి చేసుకుంటావా? ఆత్మహత్య చేసుకుంటావా అంటూ సతీశ్ ఆమెకు పురుగు మందు ఇచ్చాడు. అతడి వేధింపులు భరించలేక ఆమె పురుగు మందు తాగేసింది. ఈలోగా ఆమె అక్క రావడంతో సతీశ్ పారిపోయాడు.
జరిగిన విషయాన్ని త్రిష తన అక్కకు చెప్పడంతో వెంటనే 108కు సమాచారం ఇచ్చారు. అంబులెన్సు వచ్చేసరికి త్రిష మృతి చెందింది. ఆమె తల్లి స్వప్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు సతీశ్‌తో పాటు అతడి తల్లిదండ్రులు పద్మ, లింగయ్యలపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.
ఇవీ చదవండి: