అర్ధరాత్రి సమయంలో ప్రియురాలి కోసం ఆమె ఇంటికి వెళ్లిన ప్రేమికుడు.. వెళ్లిన కాసేపటికే విగత జీవిగా మారాడు. ఈ ఘటన హైదరాబాద్ బాలానగర్‌లో చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట నెహ్రూ నగర్‌కు చెందిన శుభం(26)కు ఇన్‌స్టాగ్రామ్‌లో బాలానగర్ శోభనాకాలనీకి చెందిన ఓ యువతి(22)పరిచయమైంది. యువతితో గత కొంతకాలంగా ఆ యువకుడు సన్నిహితంగా ఉంటున్నాడు.
మద్యం మత్తులో
ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో మద్యం మత్తులో ఉన్న యువకుడు ప్రియురాలి ఇంటి వద్దకు వెళ్లాడు. తనను బయటకు రమ్మని వాదించగా తాను రానని యువతి తేల్చిచెప్పింది. యువతిని తనతో బయటకు పంపాలని ఆమె తల్లిదండ్రులతోనూ వాగ్వాదానికి దిగాడు. తనతో రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పాడు. అయినా వారి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.
దీంతో మనస్తాపానికి గురైన ప్రియుడు.. వెంటనే అదే భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా... అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఇది హత్యే..
ఇదిలా ఉండగా ఘటనపై శుభం తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఆటోలో ఆస్పత్రికి ఎలా తీసుకెళ్తారని ప్రశ్నించారు. యువతి కుటుంబీకులే తమ కుమారుడిని చంపేశారని ఆరోపించారు. ఇంతకీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేక.. యువతి తల్లిదండ్రులే చంపేశారా అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
ఇదీ చూడండి: drugs seized: శంషాబాద్ విమానాశ్రయంలో రూ.20 కోట్ల డ్రగ్స్ స్వాధీనం