లాక్డౌన్ కారణంగా స్వగ్రామానికి రాక..
ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో పరువు హత్య వెలుగుచూసింది. గ్రామానికి చెందిన 22ఏళ్ల ధనశేఖర్ (Dhanasekar) అనే యువకుడు బెంగుళూరులో డ్రైవర్గా పనిచేస్తుండగా.. లాక్డౌన్ కారణంగా గ్రామానికి తిరిగి వచ్చాడు. శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ధనశేఖర్ నివాసానికి తిరిగి రాకపోవటంతో.. సోమవారం పలమనేరు ఠాణాలో బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతితో రెండేళ్లుగా ప్రేమ(love)లో ఉన్నాడని, ఈ మేరకు యువతి తండ్రిపై అనుమానం ఉందని పోలీసులకు తెలిపారు.
విచారణలో దారుణ విషయాలు..
ఈ నేపథ్యంలో పోలీసులు మిస్సింగ్ కేసు (Missing Case) కింద దర్యాప్తు ప్రారంభించగా.. విచారణలో దారుణ విషయాలు వెలుగు చూశాయి. యువతి తండ్రి బాబు కాల్ డేటా, ధనశేఖర్ కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు.. శనివారం రాత్రి యువతి తండ్రి నుంచి బాధితుడికి ఫోన్ వెళ్లినట్లు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. అత్యంత పాశవికంగా కత్తితో నరికేశానని(Brutal murder) పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.
విచక్షణ కోల్పోయి..
శనివారం రాత్రి యువతి తన తండ్రి ఫోన్ నుంచి ధనశేఖర్కి ఫోన్ చేయగా.. ఇద్దరు యువతి ఇంట్లోనే కలుసుకున్నారు. బాబు అనుమానంతో అర్థరాత్రి కుమార్తె గది సమీపంలోకి వెళ్లగా ఇద్దరూ సన్నిహితంగా ఉండటంతో యువతి తండ్రి విచక్షణ కోల్పోయాడు. కత్తితో యువకుడిపై తీవ్రంగా దాడి చేస్తూ ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లిన యువతి తండ్రి.. అనంతరం హత్య చేసి బావిలో పడేశాడు.
కాల్ డేటా ఆధారంగా..
ధనశేఖర్ ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారన్న సమాచారంతో.. రెండు రోజుల తర్వాత తిరిగి బావి వద్దకు వెళ్లిన యువతి తండ్రి.. మృతదేహం(dead body) నీటిపై తేలుతుండటం చూసి.. దొరికిపోతాననే భయంతో ఆ మృతదేహాన్ని బయటకు తీసి ముక్కలు ముక్కలుగా పాశవికంగా నరికాడు. అనంతరం ఛిద్రమైన శరీరభాగాలను తన పొలంలోనే పూడ్చి పెట్టాడు. కానీ పోలీసులు కాల్ డేటా ఆధారంగా నిందుతుడిని అదుపులోకి తీసుకుని విచారించటంతో నేరాన్ని ఒప్పుకున్నాడు.
కోర్టులో హాజరుపరుస్తాం : డీఎస్పీ గంగయ్య
నిందితుడిచ్చిన సమాచారం మేరకు ఉదయం అతని పొలంలో సోదా చేసి.. ధనశేఖర్ శరీర భాగాలను బయటకి తీసి పోస్ట్ మార్టంకు తరలించారు. నిందితుడు బాబును అప్పటికే అరెస్ట్ చేసినట్లు తెలిపిన పోలీసులు.. కోర్టులో హాజరుపరచనున్నట్లు పలమనేరు డీఎస్పీ గంగయ్య (Dsp Gangayya) తెలిపారు.
తక్కువ కులం పేరిట..
కుమార్తె కులాంతర ప్రేమ కారణంగా విచక్షణ కోల్పోయిన తండ్రి పరువు పోతుందనే నెపంతో నేరం చేసిన తీరు పోలీసులనూ తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది. కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితుడ్ని కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: Raghurama Case: ఏపీ డీజీపీ, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు