రాష్ట్ర వ్యాప్తంగా జూదంపై నిషేధం ఉండడంతో పేకాట(Gambling) ప్రియులు కిట్టి పార్టీలను ఎంచుకుంటున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ఖరీదైన విల్లాలు, రిసార్ట్స్, ఫామ్ హౌజ్‌లు పేకాట శిబిరాలయ్యాయి. ఇక్కడ ఒక్కో రోజు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం సైబరాబాద్ పరిధిలోని మంచి రేవుల ఫామ్ హౌజ్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారు.
పోలీసులకు అనుమానం రాకుండా...
పోలీసులకు అనుమానం రాకుండా పార్టీ ఖర్చు భరిస్తామంటూ మహిళలను వెంబడి తీసుకెళ్లి మరీ కిట్టి పార్టీల పేరుతో పేకాట ఆడుతున్నారు. కొద్ది రోజుల క్రితం బేగంపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించగా... అక్కడ 30 మంది మహిళలు ఉండటమే ఇందుకు సాక్ష్యం. ఇలా వారాంతాల్లో జరిగే పార్టీల్లో కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు పాల్గొంటున్నారు.
గొడవ పడడంతో బయటికి వస్తున్న వ్యవహారం...
గుట్టు చప్పుడు కాకుండా కొనసాగుతున్న ఈ పేకాట శిబిరాల వ్యవహారం బాగా డబ్బు పోగొట్టుకున్న వ్యక్తులు గొడవ పడడంతో బయటికి వస్తున్నాయి. మరికొంత మంది మద్యం మత్తులో వీటి గుట్టు రట్టు చేస్తున్నారు. రాత్రి వేళల్లో నగర శివారు ప్రాంతాలు, రిసార్ట్స్, ఫామ్ హౌజ్‌లు , ఫంక్షన్ హాళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తే ఇలాంటి జూదాలకు కళ్లెం పడుతుంది.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో అసలేం జరుగుతోంది.. మెయిన్ సెంటర్లలో ఈ దోపిడీలేంటి?