CYBER CRIME: పార్ట్‌టైం జాబ్ కోసం వెతుకుతుండగా వాట్సప్‌కు మెసేజ్ వచ్చింది. పెట్టుబడి పెట్టండి లాభం తీసుకోండి అంటూ.. సైబర్ నేరగాడు సందేశం పంపాడు. నమ్మి అతను చెప్పిన విధంగా చేసిన ప్రైవేటు ఉద్యోగి నిలువున మోసపోయాడు. జ్ఞానరాజు పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో ఉంటూ, మాదాపూర్లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 26న వాట్సప్‌లో వచ్చిన మెసేజ్ ఓపెన్ చేశాడు. అది టెలిగ్రాంలో ఓపెన్ అయ్యింది. పెట్టుబడి పెడితే దానికి లాభం వస్తుందని సందేశం ఉంది.
జ్ఞానరాజు తొలుత రూ.1000, తర్వాత రూ.5 వేలు పెడితే లాభం వచ్చింది. దీంతో రూ. 80,000 ఒకసారి, రెండోసారి రూ.2.5 లక్షలు, ఇలా దఫదఫాలుగా రూ.6.5 లక్షలు వరకూ పెట్టాడు. అనంతరం స్నేహితుల వద్ద అప్పు తీసుకుని మరో రూ.8.09 లక్షల వరకూ పెట్టగా, మొత్తం 14. 50 లక్షలు అయింది. పోర్టల్లో రూ.22.69 లక్షలు కనిపిస్తోంది. విత్‌డ్రా చేసుకోవాలంటే మరో రూ.3.5 లక్షలు చెల్లించాలని చెప్పడంతో మోసపోయానని గ్రహించిన జ్ఞానరాజు సైబర్ క్రైమ్ విభాగంతోపాటు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఐదు సెకన్లలో రుణం పేరిట మోసం: ఓ వ్యక్తి ఐదు సెకన్లలో రూ.5 లక్షల రుణం ఇస్తామన్న ప్రకటన చూసి మోసపోయాడు. ముత్తంగి గ్రామానికి చెందిన పాండు ప్రైవేటు ఉద్యోగి. ఈనెల 25న తన ఫేస్‌బుక్ ఓపెన్ చేయగా.. అందులో 5 సెకన్లలో రూ.5 లక్షల రుణం ప్రకటన చూశాడు. అందులో సూచించిన నంబర్‌కు ఫోన్ చేశాడు. రుణం కావాలంటే ముందు రూ.2,500 చెల్లించాలన్నారు.
దస్త్రాల ఖర్చు కింద రూ.4,500, బీమా కింద రూ.18,900, బ్యాంకు సపోర్టు చేయడం లేదని రూ.32 వేలు ఒకసారి, తర్వాత రూ.32,500 తర్వాత 15,500. ఇలా దఫాదఫాలుగా మొత్తం రూ.2.48 లక్షలు వేశాడు. అనంతరం అవతల వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. మోసపోయాయని గ్రహించి పటాన్‌చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
పార్ట్‌టైం జాబ్ పేరుతో మోసం: పార్ట్‌టైం జాబ్ కోసం ఓ మహిళ నుంచి పటాన్‌చెరు మండలం రామేశ్వరంబండకు చెందిన వెంకటసాయి ధనలక్ష్మి ఈనెల 23న ఫేస్‌బుక్‌లో పార్ట్‌టైం ఉద్యోగం ప్రకటన చూసి లింక్ ఓపెన్ చేసింది. అమెజాన్ సోఫియా అంటూ ఓ యువతి చాట్ చేసింది. ఒక యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయించింది. లాగిన్ అవగానే రూ.100 బోనస్ ఇచ్చారు.
ఆ తర్వాత అమెజాన్ ఆర్డర్ ప్లేస్మెంట్ టాస్క్ వస్తుంది అది పూర్తి చేస్తే కమిషన్ వస్తుందని చెప్పింది. తొలుత రూ.98 పెడితే రూ.14 వచ్చాయి. అలాగే 15 వస్తువులు ఆర్డర్ చేసి ఈ నెల 24 లోపు ధనలక్ష్మి రూ.1.06 లక్షలు చెల్లించింది. చివరకు నగదు ఇవ్వాలని కోరగా.. ఇంకా ఆర్డర్ చేస్తేనే ఇస్తామని చెప్పారు. దీంతో అనుమానం వచ్చి పటాన్ చెరు ఠాణాలో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫాస్ట్‌ట్యాగ్ పేరిట మోసం: ఫాస్ట్‌ట్యాగ్ కోసం యాప్ ద్వారా దరఖాస్తు చేసుకున్నా రాకపోవడంతో కొరియర్ కస్టమర్‌కు ఫోన్ చేయగా.. సైబర్ నేరగాడు మాయమాటలు చెప్పి లింక్ ఓపెన్ చేయించి ఖాతా నుంచి నగదు దోచేశాడు. పటాన్‌చెరు శ్రీరాం నగర్‌కు చెందిన అమరేందర్ రెడ్డి ఫాస్ట్‌ట్యాగ్ కోసం ఒక యాప్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. అది రాకపోవడంతో అంతర్జాలంలో ఈ నెల 26న బ్లూడార్ట్ కస్టమర్‌కేర్ పేరుతో ఉన్న నంబర్‌కు ఫోన్ చేశాడు.
మీ చిరునామాకు వచ్చి మళ్లీ తిరిగి వెనక్కి వచ్చిందని చెప్పారు. అనంతరం ఓ లింక్ పంపి దాన్ని ఓపెన్ చేయాలని సూచించాడు. అది ఓపెన్ చేయగానే ఆన్‌లైన్ ఫిర్యాదు తిరస్కరణ అని సందేశం వచ్చింది. మరుసటి రోజు రూ.25 వేలు ఒకసారి, 50 వేలు ఒకసారి, మరోసారి రూ. 700 కట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇవీ చదవండి: