Roof collapsed in Ramagundam Coal Mine: పెద్దపల్లి జిల్లా రామగుండం బొగ్గుగనిలో ప్రమాదం చోటుచేసుకుంది. రామగుండం రీజియన్ ఆర్జీ- 3 పరిధిలోని అడ్రియాల్ లోంగోవాల్ ప్రాజెక్టులో బొగ్గు గని పైకప్పు కూలింది. ఘటనలో నలుగురు సిబ్బంది బొగ్గు గని పొరల్లో చిక్కుకుపోగా.. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు.
పైకప్పు పనులు చేస్తుండగా
సింగరేణి ఏఎల్‌పీలోని 85వ లెవల్ వద్ద రూఫ్ బోల్ట్ చేస్తుండగా పక్కన గోడ కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉదయం షిఫ్ట్ కార్మికులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ సైడ్‌వాల్ కూలిందని చెప్పారు. ఓ అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారితో పాటు ముగ్గురు కార్మికులు బొగ్గు గని పొరల్లో చిక్కుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం వెల్లడైంది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రెస్క్యూ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను రామగుండం సింగరేణి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలి ప్రాంతంలోని మట్టిని తొలగిస్తే.. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: Road accident in nizamabad: అతివేగానికి ఇద్దరు యువకులు మృతి