భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కొవిడ్ విలయానికి నలుగురు బలయ్యారు. తండ్రీకొడుకులు ఒకే రోజు మృత్యువాత పడ్డారు. పట్టణానికి చెందిన శివానంద్ లోద్ కొవిడ్ బారినపడి హైదరాబాద్‌లో చికిత్సపొందుతూ మరణించారు. అతని మృతదేహం స్వగ్రామం ఇల్లందుకు చేరుకునేలోపే అతని కుమారుడు కొవిడ్ బారినపడి ఖమ్మంలోని ఓ వైద్యశాలలో ఐదు రోజులుగా చికిత్స పొందుతూ ఆయన కుమారుడు సుభాష్ లోద్ కూడా మృతి చెందాడు. తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన బంధువులు.. కుటుంబ సభ్యులు మరో గంట తర్వాత కుమారుడికి కూడా అంతక్రియలు నిర్వహించడం స్థానికులను కలచివేసింది.
కొవిడ్ తో మరణించిన ఓ మహిళకు పురపాలక ఛైర్మన్ అంత్యక్రియలు నిర్వహించారు. పట్టణానికి చెందిన లక్ష్మీ నరసమ్మ కరోనా బారినపడి మృతి చెందగా… అంతిమ సంస్కారాలకు ఒకరిద్దరు మినహా ఎవరు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న పురపాలక ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పురపాలక సిబ్బందితో కలిసి అంతక్రియలు నిర్వహించారు. కరోనా బారిన పడి మృతిచెందిన వారి పట్ల మానవత్వం లేకుండా వ్యవహరించవద్దని ఆయన కోరారు.
దర్గాలో మాలిక్ పనిచేస్తున్న మహబూబ్… కరోనా బారిన పడి ఖమ్మంలో చికిత్స పొందుతూ మరణించగా... బాలాజీ నగర్‌కు చెందిన సింగరేణి విశ్రాంత కార్మికుడు ఆకారపు వెంకటేశ్వర్లు కొత్తగూడెం వైద్యశాలలో చికిత్స పొందుతూ మరణించారు.